సాక్షి, ముంబై: పొగాకు వాడకంపై డబ్బావాలాలు యుద్ధం ప్రకటించనున్నారు. ఈ మేరకు పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తే జరిగే అనర్థాలను వారు నగరమంతా ప్రచారం చేయనున్నారు. ‘వరల్డ్ నో టొబాకో డే’ను పురస్కరించుకొని నగర డబ్బావాలాలు కేవలం భోజనం సరఫరా చేయడమేకాకుండా ఆరోగ్యానికి సంబంధించిన ట్యాగ్‌లతో నగర వాసులకు సందేశాన్ని అందించనున్నారు. ‘జీవితం ఎంతో విలువైంది’, ‘పొగాకు ఉత్పత్తుల వినియోగంతో మీ ఆయుష్షును ఇంకా తగ్గించుకోకండి’, ‘ధూమపానమైనా మానుకోండి లేదా మీ జీవితంపై ఆశలైనా వదులుకోండి’... తదితర ట్యాగ్‌లతో నగర వాసులకు సందేశాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు. సలామ్ బాంబే ఫౌండేషన్ (ఎస్‌బీఎఫ్), బజాజ్ ఎలక్ట్రికల్స్ సంయుక్తంగా ‘టొబాకో ఫ్రీ ఇండియా’ సందేశాన్ని ఇస్తున్నారు. అంతేకాకుండా తమ వద్దకు వచ్చే వినియోగదారులకు కూడా ధూమపానం వల్ల కలిగే దుష్పరిణామాలను వివరిస్తున్నారు.
ఈ సందర్భంగా ఎస్‌బీఎఫ్ ప్రముఖురాలు అదితి పరిఖ్ మాట్లాడుతూ.. ‘పొగ తాగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎందరో ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే. అందుకే పొగ తాగడం, పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల కలిగే నష్టాలకు సంబంధించిన సమాచారం వివరించేందుకు డబ్బావాలాల సహకారం తీసుకుంటున్నాం’ అని తెలిపారు. చాలా మంది డబ్బావాలాలు కూడా ఈ వ్యసనానికి బానిసలయ్యారని అన్నారు. ఈ సందేశం ముంబైకర్లతోపాటు కూడా వీరిలో కూడా అవగాహన కల్పిస్తుందని పరిఖ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
నగర వ్యాప్తంగా భోజనం సరఫరా చేసే దాదాపు 1,200 మంది డబ్బావాలాలు ఈ సందేశాన్ని ముంబైకర్లకు అందించనున్నారు. ఆరు ప్రాంతాల్లో భోజనం సరఫరా చేసే డబ్బావాలాలను, అదేవిధంగా అంధేరి, దాదర్, లోయర్‌పరేల్, చర్నీరోడ్, మెరైన్‌లైన్స్, చర్చ్‌గేట్ రైల్వే స్టేషన్లను ఎంచుకున్నామని నిర్వాహకులు తెలిపారు. దీని కోసం డబ్బావాలాలు భోజనాన్ని అందించేందుకు వెళ్లినప్పుడు పలు సందేశాలతో కూడిన బ్యాడ్జీలు, టీ-షర్టులు ధరించనున్నారు.
ఇదిలా వుండగా పొగాకు ఉత్పత్తులను రెండుగా వర్గీకరించారు. సిగరెట్, బీడీలను పొగ తాగేందుకు ఉపయోగిస్తుండడం తెలిసిందే. స్మోక్ ఫ్రీ ఉత్పత్తులుగా ఖైనీ, మావా, గుట్కా, పాన్‌మసాలాను పరిగణిస్తారు. మనదేశంలో పొగాకు ఉపయోగించేవాళ్లు 27.5 కోట్ల మంది ఉండగా, ఇందులో 25.9 శాతం మంది స్మోక్‌లెస్ టొబాకో సేవించగా, 5.7 శాతం మంది సిగరెట్లు, 9.2 శాతం మంది బీడీలను సేవిస్తున్నారని తేలింది.
‘పొగాకుపై పన్ను పెంచాలి’
ముంబై: ప్రపంచవ్యాప్తంగా పొగాకు వినియోగం వల్ల చాలా మంది నష్టపోతున్నందున, దీని వినియోగాన్ని తగ్గించడానికి పన్నులు అధికం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అభిప్రాయపడింది. అన్ని దేశాల్లో శనివారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినాన్ని జరుపుకుంటున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌ఓ భారత ప్రతినిధి డాక్టర్ నాటా మెనబ్డే పైవిధంగా అన్నారు. ఫలితంగా బాధితుల సంఖ్య తగ్గే అవకాశం ఉందన్నారు. చైనా తరువాత అత్యధికంగా పొగాకును ఉత్పత్తి చేస్తున్నది భారతదేశమే కావడం గమనార్హం. మనదేశంలో పొగాకు ఉత్పత్తుల ఉపయోగించడం వల్ల ఏటా తొమ్మిది లక్షల మంది మరణిస్తున్నారని అంచనా. పొగాకు ధరను పది శాతం పెంచితే వినియోగాన్ని 4-5 శాతం తగ్గించవచ్చని నాటా అన్నారు.
పెరుగుతున్న వినియోగం
ధూమపానం గురించి సినిమాలు, టీవీ ప్రకటనల్లో ఎంతగా హెచ్చరిస్తున్నా, ముంబైకర్ల ధోరణిలో మాత్రమ మార్పు కనిపించడం లేదు. గత మూడేళ్ల నుంచి ఇప్పటి వరకు సిగరెట్ల వినియోగాన్ని చాలా పెంచామని పొగరాయుళ్లలో 41 శాతం మంది తెలిపారు. ప్రైవేటు బీమా కంపెనీ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడయింది. వ్యక్తిగత, వృత్తి జీవితంలో ఒత్తిడిని తగ్గించుకునేందుకు సిగరెట్లు ఉపయోగపడతాయని వీళ్లు భావిస్తున్నారని తెలిపింది. సర్వేలో పాల్గొన్న వారిలో 95 శాతం మందికి సిగరెట్‌ను వదిలిపెట్టాలన్న కోరిక లేదని వెల్లడించింది.
‘పొగ’పై పోరాటం
Published Fri, May 30 2014 11:06 PM | Last Updated on Sat, Sep 2 2017 8:05 AM
Advertisement
Advertisement