
ఆగని రైతు ఆత్మహత్యలు
రాష్ట్రవ్యాప్తంగా మరో ఐదుగురు బలవన్మరణం
బెంగళూరు(బనశంకరి) : రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఐదుగురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. పంటనష్టం, అప్పుల బాధతాళలేక తీవ్ర మనస్థాపం చెందిన అన్నదాతలు ఆత్మహత్యల బాట పడుతున్నారు.
హవేరి జిల్లాలో...
హవేరిజిల్లాకు మద్లేరి గ్రామానికి చెందిన రైతు దిళ్లప్పసణ్ణకంచేళెర(50) తనకున్న మూడెకరాల భూమిలో చెరుకు ఇతర పంట పెట్టుబడుల నిమిత్తం వివిధ బ్యాంకులు, ప్రైవేటు వ్యక్తులనుంచి రూ.4 లక్షల మేర అప్పులు చేశాడు. పంటనష్టం రావడంతో అప్పులు తీర్చేమార్గం కానరాక దిక్కుతోచని స్దితిలో గురువారం ఉదయం విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అలాగే హవేరి గ్రామాంతర పోలీస్‌స్టేషన్ పరిధిలోని కెరెమత్తెహళ్లికి చెందిన రైతు మంజుబీమప్పనవర్(32) తనకున్న 1.5 ఎకరాల భూమిలో చెరుకు పంట పెట్టుబడుల కోసం సహకారబ్యాంక్‌లో రూ. 1 లక్ష మేర అప్పుచేశాడు. నీరు లేక చెరుకు పంట ఎండిపోయింది. పెసరుపంట సక్రమంగా దిగుబడిరాలేదు. ఈ నేపథ్యంలోనే అప్పు చెల్లించాలంటూ బ్యాంకుల అధికారులు నోటీసులు పంపారు. పంటనష్టం రావడంతో అప్పుతీర్చేమార్గం లేక రైతు మంజుబీమప్పనవర్ ఇంటిలో గురువారం ఉరివేసుకున్నాడు.
మండ్య జిల్లాలో
మండ్య జిల్లా మద్దూరు తాలూకా బీదరహొసహళ్లి కి చెందిన రైతు కెంపేగౌడ(45) తనకున్న 30 గుంటల భూమిలో చెరుకు, రేషం పంట పెట్టుబడుల నిమిత్తం లక్షాంతర రూపాయలు అప్పు చేశాడు. చెరుకు పంటకు మద్ధతు ధర లభించకపోవడంతో అప్పులకు వడ్డీలు కూడా చెల్లించలేకపోయాడు. ఈ నేపథ్యంలోనే అప్పులు తీర్చాలంటూ వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో గురువారం తెల్లవారుజామున కెంపేగౌడ తన పొలం వద్దకు చేరుకుని చెట్టుకు ఉరివేసుకున్నాడు. ఇదే జిల్లాలోని కృష్ణరాజపేటె తాలూకా కిక్కేరి హొబళి సొళ్లాపుర గ్రామానికి చెందిన రైతు పాపేగౌడ(75) తనకున్న రెండన్నర ఎకరాల పొలంలో చెరుకు పంట వేశాడు. దీని పెట్టుబడుల నిమిత్తం లక్షాంతర రూపాయలు అప్పులు చేశాడు. చెరుకు పంట ఫ్యాక్టరీకి తరలించినా అప్పుతీర్చడానికి సాధ్యం కాకపోవడంతో బుధవారం రాత్రి విషం తాగాడు. విషయాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే అతన్ని హసన్ జిల్లాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం అతను మరణించాడు. కాగా, మండ్య జిల్లాలో ఇప్పటివరకు ఆత్మహత్యకు పాల్పడిన రైతుల సంఖ్య 24కు చేరుకుంది.
తుమకూరు జిల్లాలో బంగారునగలు కుదవపెట్టి బోరు తవ్వించినా నీరు లభించకపోవడంతో తీవ్రమనస్థాపం చెందిన ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శిరా తాలూకాలో చోటుచేసుకుంది. నాదూరు గ్రామానికి చెందిన రైతు సిద్దేశ్వరప్ప(40) తనకున్న ఆరున్నర ఎకరాల పొలంలో కొబ్బరితోట, వక్కచెట్లు వేశాడు. గత ఏడాది బోరు బావి ఏర్పాటు చేయించాడు. భూగర్భ జలాలు అడుగంటడంతో అందులో నీరు లభ్యం కాలేదు. పంటను కాపాడుకోవటానికి భార్య, అమ్మ వద్ద ఉన్న నగలను కెనరాబ్యాంకులో కుదవపెట్టి వారం రోజుల క్రితం మళ్లీ బోరు వేయించాడు. దీనిలో కూడా నీరు లభించ లేదు. నీరు లేకపోవడంతో కొబ్బరి, వక్కచెట్లు ఎండిపోవడం మొదలయ్యాయి. మొక్కజొన్న పంట కూడా ఎండిపోవడంతో అప్పులు తీర్చే దారి కనిపించలేదు. దీంతో గురువారం ఉదయం అతను ఉరి వేసుకున్నాడు.