రజనీయా మజాకా
రజనీకాంత్ ఎవరికీ అంత సులభంగా చిక్కరన్న విషయం మరోమారు స్పష్టమైంది. రాజకీయ ఊబిలో దిగాలా? అంత సాహసం చేయబోను అంటూనే మళ్లీ దేవుడి మీద భారాన్ని వేశారు. లింగా ఆడియో ఆవిష్కరణలో స్టార్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దీంతో కమలనాథుల్లో కలవరం మొదలైంది.
సాక్షి, చెన్నై:రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు ఏళ్ల తరబడి ఆశిస్తున్నారు. అయితే, ఎక్కడా ఎవరికీ చిక్కకుండా రజనీ అడుగులు వేస్తున్నారు. అభిమానుల విన్నపాన్ని దాట వేస్తూనే, దేవుడు ఆదేశిస్తే వస్తా అన్న మెలిక పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో బీజేపీ వర్గాలు రజనీ జపం పటిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీకి సన్నిహితుడు కావడంతో ఆయన్ను తమ వైపు తిప్పుకుని రాష్ర్టంలో బలపడాలన్న లక్ష్యంతో పావులు కదుపుతున్నారు.
రజనీ మజాకా: రాష్ట్రంలో అన్నాడీఎంకే, డీఎంకేలు అవినీతి ఊబిలో కూరుకుపోయిన దృష్ట్యా, ప్రత్యామ్నాయ శక్తిగా తామే అవతరించాలన్న లక్ష్యంతో కమలనాథులు వేస్తున్న అడుగులకు, చేస్తున్న వ్యాఖ్యలకు రజనీ మాత్రం స్పందించ లేదు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెయిల్ మీద బయటకు వచ్చిన జయలలితను లేఖాస్త్రంతో పరామర్శించి తన రూటే సపరేటు అనిపించారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా సెలబ్రెటీలకు ఇచ్చే సెంటినరీ అవార్డును ఈ సారి రజనీకాంత్‌కు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. రజనీ మద్దతు నినాదంతో మరికొన్ని పార్టీలు గళం విప్పుతుండడం ఁస్టార్‌రూ. నిర్ణయం ఎటో అన్న ఎదురు చూపులు పెరిగాయి. అయితే, తానెవ్వరికీ చిక్కనని మరోమారు రజనీకాంత్ స్పష్టం చేయడం కమలనాథులతో పాటుగా మద్దతు ఆహ్వానం పలికే పనిలో ఉన్న మరికొన్ని పార్టీ వర్గాల్లో కలవరాన్ని రేపింది.
వ్యాఖ్యల చర్చ : లింగ వేడుకను తమ ప్రసంగం ద్వారా కొందరు రాజకీయ వేదికగా చేశారని చెప్పవచ్చు. రచయిత వైరముత్తు తన ప్రసంగంలో రజనీ కాంత్‌కు అన్నీ తెలుసని, ఆయన రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోలేమని వ్యాఖ్యానించారు. దర్శకుడు అమిర్ అయితే, ఏకంగా రజనీకాంత్ రాజకీయాల్లో ఉన్నత పదవిని అధిరోహించాలని వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. అయితే, రాజకీయ వ్యాఖ్యలకు చెక్ పెట్టే రీతిలో రజనీకాంత్ తన దైన శైలిలో స్పందించారు.
రాజకీయాలు పెద్ద ఊబి అని, అందులో మునిగిన పక్షంలో తేలడం కష్టం అని వ్యాఖ్యానించారు. ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వస్తే, పదవిలో కూర్చున్నాక సేవ చేయడానికి అనేక అడ్డంకులు ఎదురవుతాయని పరోక్షంగా కమలం ఇచ్చిన సీఎం అభ్యర్థిత్వం ఆఫర్‌ను తిరస్కరించడం గమనార్హం. రాజకీయ ఊబిలో కూరుకుపోయి ఎదురీదలేని వాళ్లను చూశానంటూనే...తనకు భయం లేదంటూ ఆ సాహసం చేయబోనంటూ స్పందించారు. ఇక తనకు అభిమానులు ముఖ్యం అని, వారి కోసం ఏమైనా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని వారిని ఉత్తేజ పరిచే వ్యాఖ్యలు చేస్తూ, రాజకీయ అరంగేట్ర నినాదానికి మంగళం పాడాలని పిలుపు నివ్వడం విశేషం. రాజకీయాల్లోకి వ చ్చేది లేనిది మాత్రం దేవుడి ఆదేశం...ఆయన ఆదేశాన్ని శిరసా వహిస్తానంటూ రాజకీయ ప్రచారానికి ముగింపు ఇవ్వడం గమనార్హం.