న్యూఢిల్లీ: ఫ్యాక్టరీల చట్టం 1948 ప్రకారం ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లో వెలుస్తున్న పరిశ్రమల సంఖ్య భారీగా పెరిగినట్టు తేలింది. 2010-11 ఆర్థిక సంవత్సరంలో 2,878గా ఉన్న ఫ్యాక్టరీల సంఖ్య 2011-12 నాటికి 2,976కు చేరుకుందని పరిశ్రమల వార్షిక సర్వే (ఏఎస్‌ఐ) వెల్లడించింది. వీటిలో 2001 తరువాత 788 ఫ్యాక్టరీలు ఏర్పడ్డాయి. ఇక 950 ఫ్యాక్టరీలను (32 శాతం) ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలుగా, 852 ఫ్యాక్టరీలను భాగస్వామ్య సంస్థలుగా, 1,030 ఫ్యాక్టరీలను వ్యక్తిగత యాజమాన్యం ఉన్న సంస్థలుగా వర్గీకరించారు.
వీటిలో అత్యధిక పరిశ్రమలు అంటే 486 ఫ్యాక్టరీలు వస్త్ర ఉత్పత్తి రంగంలో ఉన్నాయి. 270 సంస్థలు ఎలక్ట్రికల్ ఉపకరణాలను తయారు చేస్తున్నాయి. 257 కంపెనీలు లోహ ఉత్పత్తులను అందిస్తున్నాయని ఆర్థిక, గణాంకాలశాఖ డెరైక్టరేట్ తెలిపింది. ఈ మొత్తం ఫ్యాక్టరీలు 1.19 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. 1,251 ఫ్యాక్టరీల్లో (42 శాతం) 100 కంటే ఎక్కువ మంది పనిచేస్తున్నారు. 566 ఫ్యాక్టరీల్లో 50 నుంచి 99 మంది వరకు, 902 ఫ్యాక్టరీల్లో 10 నుంచి 49 మంది వరకు కార్మికులు ఉన్నారు. 2010-11 ఆర్థిక సంవత్సరంలో వీటిన్నింటి వార్షికాదాయం రూ.48,687 కోట్లు కాగా, 2011-12లో ఇది రూ.50,900 కోట్లకు (4.5 శాతం) పెరిగింది.
స్థూల విలువ రూ.6,328 కోట్ల నుంచి రూ.6,951 కోట్లకు పెరిగింది. ఇక నికర ఆదాయం రూ.4,698 కోట్ల నుంచి రూ.5,143 కోట్లకు చేరింది. జిల్లావారీ గణాంకాలను పరిశీలిస్తే వాయవ్యఢిల్లీలో అత్యధికంగా 925, దక్షిణ ఢిల్లీలో 789, పశ్చిమ ఢిల్లీలో 225, తూర్పుఢిల్లీలో 106, మధ్యజిల్లాలో 54, ఈశాన్య జిల్లాలో 53, నైరుతి ఢిల్లీలో 45, న్యూఢిల్లీలో 36 ఫ్యాక్టరీలు ఉన్నాయని పరిశ్రమల వార్షిక సర్వే (ఏఎస్‌ఐ) నివేదిక వెల్లడించింది.
పెరిగిన ఫ్యాక్టరీల సంఖ్య
Published Sat, Aug 9 2014 10:26 PM | Last Updated on Sat, Sep 2 2017 11:38 AM
Advertisement
Advertisement