ప్రతి కార్యకర్త, నాయకుడు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ పథకాలు, పార్టీ పనితీరు గురించి విశదీకరించాలని అన్నాడీఎంకే కోశాధికారి, ఆర్థిక మంత్రి ఓ పన్నీరు సెల్వం పిలుపునిచ్చారు.
సాక్షి, చెన్నై :ప్రతి కార్యకర్త, నాయకుడు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ పథకాలు, పార్టీ పనితీరు గురించి విశదీకరించాలని అన్నాడీఎంకే కోశాధికారి, ఆర్థిక మంత్రి ఓ పన్నీరు సెల్వం పిలుపునిచ్చారు. ముల్లై పెరియార్ విజయోత్సవ సభ సక్సెస్ లక్ష్యంగా కసరత్తుల్లో మం త్రుల బృందం మునిగింది. విరుదునగర్ జిల్లా శివకాశిలో ఆదివారం పార్టీ వర్గాలతో సమీక్షలో మునిగారు. ముల్లై పెరియార్ డ్యాం నీటి మట్టాన్ని 136 నుంచి 142 అడుగులకు పెంచుకోవచ్చని సుప్రీం కోర్టు ఇటీవల తీర్పు నిచ్చింది. ఆ మేరకు అందుకు తగ్గ కార్యాచరణ వేగవంతం అయింది. నీటిమట్టం పెంపు లక్ష్యంగా ప్రత్యేక కమిటీ రంగంలోకి దిగింది. చారిత్రక విజయంతో ఆ డ్యాం మీద సర్వ హక్కులు తమిళనాడుకే అని చాటి చెప్పడంలో శ్రమించిన సీఎం జయలలితను సత్కరించుకునేందుకు ఆ నీటి ఆధారిత జిల్లాల రైతు సంఘాలు నిర్ణయించాయి.
తేని, విరుదునగర్, శివగంగై, రామనాథపురం, మదురై జిల్లాల అన్నదాతలు ఇందుకు తగ్గ ఏర్పాట్లు చే స్తున్నారు. ఓ వైపు అన్నదాతలు, మరో వైపు ఆ విజయోత్సవ సభ సక్సెస్ లక్ష్యంగా అన్నాడీఎంకే సీనియర్ నాయకులతోపాటు రాష్ట్ర మంత్రుల బృందం రంగంలోకి దిగింది. ఉత్తేజ పరచండి : ముల్లై పెరియార్ నీటి ఆధారిత జిల్లాల్లోని పార్టీ వర్గాలను ఉత్తేజ పరచడంతోపాటుగా సభ విజయవంతం లక్ష్యంగా అన్నాడీఎంకే కోశాధికారి, ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వం నేతృత్వంలో మంత్రుల బృందం ఆదివారం విరుదునగర్ జిల్లాలో పర్యటించింది. శివకాశి వేదికగా ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో పార్టీ వర్గాలతో ఈ బృందం సమావేశం అయింది. ఇందులో ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వం ప్రసంగిస్తూ, మూడేళ్లలో ప్రజాహితాన్ని కాంక్షిస్తూ సీఎం జయలలిత అనేక సంక్షేమ పథకాల్ని అమల్లోకి తెచ్చారని వివరించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటీనీ మూడేళ్లలో నెరవేర్చిన ఘనత జయలలితకే దక్కుతుందన్నారు. తమిళనాడు ప్రజల జీవనాధార సమస్య ముల్లై పెరియార్, కావేరి నదీ జలాల హక్కుల విషయంలో సీఎం జయలలిత పోరాటాలకు విజయాలు వరించాయని పేర్కొన్నారు. దీర్ఘకాలంగా కోర్టుల్లో ఉన్న పలు సమస్యలను ఎదుర్కొని విజయం సాధించారని ప్రశంసలతో ముంచెత్తారు. ముల్లై పెరి యార్ డ్యాం నీటి మట్టం పెంపు చారిత్రక విజయం అని, ప్రజల కోసం శ్రమిస్తున్న జయలలితకు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు. మదురై వేదికగా ఈనెల 22న జరగనున్న ముల్లై పెరియార్ డ్యాం చారిత్రక విజయోత్సవ వేడుకకు వేలాదిగా కార్యకర్తలు, నాయకులు తరలిరావాలని పిలుపునిచ్చారు.
అలాగే, ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించి, సాధించిన విజయాలను ఎత్తి చూపి, వేలాదిగా ప్రజలు ఆ సభకు తరలి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ మంత్రి నత్తం విశ్వనాథన్, గృహ నిర్మాణ శాఖ మంత్రి వైద్యలింగం, రహదారుల శాఖ మంత్రి ఎడపాడి పళని స్వామి, సమాచార, ప్రత్యేక పథకాల శాఖ మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ, రెవెన్యూ మంత్రి ఆర్‌బి ఉదయకుమార్, విరుదునగర్ ఎంపీ రాధాకృష్ణన్, ఎమెల్యేలు వైగై సెల్వన్, గోపాల స్వామి పాల్గొన్నారు.