సాక్షి, న్యూఢిల్లీ : రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనేందుకు వస్తున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భద్రతకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, జార్జ్ బుష్ మాదిరిగానే ఒబామా కూడా ధౌలాకువాలోని మౌర్యాషెరాటన్ హోటల్‌లో ఒబామా బస చేయనున్నారు. దీంతో ఈ హోటల్‌తోపాటు పరసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. హోటల్ లోపల అమెరికా భద్రతా దళాలు, హోటల్ వెలుపల ఢిల్లీ పోలీసు బృందాలను ఇప్పటికే మోహరించారు. ఒబామా హోటల్‌లోని ప్రసిడెన్షియల్ సూట్‌లో ఉంటారు. ఈ సూట్ ఉన్న అంతస్తుతో పాటు దాని ఎగువ, దిగువ ఉన్న అంతస్తులను అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఈ మూడు అంతస్తులను అంగుళం కూడా వదులకుండా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
అంతేకాకుండా హోటల్ ప్రవేశ ద్వారాలను కూడా అమెరికా భద్రతా సిబ్బంది తమ అధీనంలోకి తీసుకున్నారు. హోటల్‌లో బసచేసేవారి వివరాలను పరిశీలిస్తున్నారు. ఒబామా రాకకు మునుపే హోటల్‌లోని అన్ని గదులను ఖాళీ చేయిస్తారని అంటున్నారు. ఒబామా ఈ హోటల్‌లో ఉన్న అన్ని రోజులు హోటల్‌లో ఇతరులెవరినీ బస చేయనీయరు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెక్నికల్ ఏరియాలో అమెరికా ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో ఒబామా దిగుతారు. విమానం ద గ్గరే నిలిపిన కాడిలాక్ కారులో ఆయన సర్దార్‌పటేల్ మార్గ్‌లో ఉన్న మౌర్యాషెరాటన్‌కు చేరుకుంటారు. ఈ మార్గంలో బాంబులేవైనా అమర్చారా అనే విషయాన్ని పరిశీలించడం కోసం కుట్ర నిరోధక విభాగం ఈ ప్రాంతమంతటినీ తనిఖీ చేయనుంది. ఈ తరహా తనిఖీలు ఒబామా రాకకు చాలారోజుల ముందునుంచే మొదలవనున్నాయి. రిపబ్లిక్ డే పరేడ్‌లో ఒబామా ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.
ఈ పరేడ్‌కు 15 వేల మంది భద్రతా సిబ్బంది భద్రత కల్పించనున్నారు. అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఒబమాకు తొలి భద్రతా వలయంగా ఉంటారు. రెండో వలయంలో సుశిక్షితులైన అత్యాధునిక ఆయుధాలు కలిగిన ఢిల్లీ పోలీస్ కమాండోలు ఉంటారు. మూడో వలయంలో స్థానిక పోలీస్ సిబ్బంది ఉంటారు. వారికి సహాయంగా పారామిలిటరీ బలగాల కమాండోలను కూడా మోహరిస్తారు. ఇంతవరకు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథులుగా పాల్గొన్నవారు రాష్ట్రపతి వాహనంలోనే పరేడ్‌కు వచ్చారు. అయితే బరాక్ ఒబామా మాత్రం అమెరికా నుంచి ప్రత్యేకంగా తీసుకొస్తున్న కాడిలాక్ కారులో పరేడ్‌కు వస్తారని అంటున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖక్జీ తన బీఎండబ్ల్యూ కారులో పరేడ్ వేదిక వద్దకు వస్తారు.
రిపబ్లిక్ డే పరేడ్‌కు ముఖ్యఅతిథిగా వచ్చేవారు ఉదయాన్నే రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి అక్కడి నుంచి రాష్ట్రపతితో కలిసి ఆయన కారులోనే రాజ్‌పథ్‌కు వస్తారు. అయితే తమ దేశ అధ్యక్షుడు ప్రపంచ ంలో ఏదేశానికి వెళ్లినా ప్రత్యేకంగా తరలించిన కాడిలాక్ కారులోనే ప్రయాణిస్తారని, రిపబ్లిక్‌డే పరేడ్‌కు కూడా ఆయన తన కాడిలాక్ లోనే రావడానికి అనుమతించాలని అమెరికా అధికారులు ఇక్కడి అధికారులను కోరుతున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆయన మరో కారులో ప్రయాణించబోరని వారు చెబుతున్నారు. సంప్రదాయాన్ని పాటించాల్సిసిందిగా భారతీయ అధికారులు కోరుతున్నప్పటికీ ఒబామా, ప్రణబ్ ముఖర్జీ విడివిడిగానే రాజ్‌పథ్‌కు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఒబామాకు భారీ భద్రతా ఏర్పాట్లు
Published Wed, Jan 7 2015 12:26 AM | Last Updated on Sat, Sep 2 2017 7:19 PM
Advertisement
Advertisement