
తమిళ పార్టీల విపరీత పోకడలు
ఆర్కే నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో తమిళ పార్టీలు విపరీత పోకడలకు పోతున్నాయి.
చెన్నై: ఆర్కే నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో తమిళ పార్టీలు విపరీత పోకడలకు పోతున్నాయి. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఈ సీటును దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అన్నాడీఎంకే పురట్చితలైవి అమ్మ(పన్నీర్ సెల్వం వర్గం) విపరీత ప్రచారానికి దిగింది. జయలలిత శవపేటిక నమూనాతో ఓట్లు అభ్యర్థించడం మొదలు పెట్టింది. 'అమ్మ' ఇమేజ్ ను క్యాష్ చేసుకునేందుకు విపరీత ప్రచారానికి దిగింది.
జయలలిత చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రి పదవి కోసం శశికళ, పన్నీర్ సెల్వం వీధి పోరాటాలకు దిగడంతో అన్నాడీఎంకే నిట్టనిలువునా చీలింది. శశికళ జైలుకు వెళ్లగా, పన్నీర్ సెల్వం పదవి కోల్పోయి మాజీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆర్కే నగర్ ఉప ఎన్నికను రెండు వర్గాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. శశికళ వర్గం నాయకులు డబ్బులు పంచుతూ ఇప్పటికే పట్టుబడ్డారు. మరోవైపు ఆర్కే నగర్ లో పాగా వేయడం ద్వారా సత్తా చాటాలని ప్రతిపక్ష డీఎంకే పట్టుదలతో ఉంది.