
అట్టహాసంగా ‘అభియాన్’
బీజేపీ మహా సంపర్క అభియాన్‌ను లాంఛనంగా ప్రారంభించిన జాతీయ అధ్యక్షుడు అమిత్ షా
దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షులు, పదాధికారులు హాజరు
పార్టీ పటిష్టతకు మార్గనిర్దేశకాలు
బెంగళూరు: దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీని(బీజేపీ) మరింత పటిష్టం చేయడంతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లో అధికారాన్ని కైవసం చేసుకునేందుకుగాను బీజేపీ ఆధ్వర్యంలో ‘మహా సంపర్క అభియాన్’ నగరంలో ఘనంగా ప్రారంభమైంది. నగరంలోని ప్యాలెస్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన దక్షిణాది రాష్ట్రాల మహా సంపర్క అభియాన్‌ను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదివారమిక్కడ లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతోపాటు ఉపాధ్యక్షుడు బి.ఎస్.యడ్యూరప్ప, కేంద్ర మంత్రులు అనంత్‌కుమార్, డి.వి.సదానందగౌడ, బీజేపీ కర్ణాటక రాజకీయ వ్యవహారాల ఇన్‌చార్జ్ మురళీధర్‌రావుతోపాటు బీజేపీ కర్ణాటక డిప్యూటీ ఇన్‌చార్జ్ బాధ్యతలను స్వీకరించిన పురందేశ్వరి, గోవా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కేరళ రాష్ట్రాలకు చెందిన పార్టీ శాఖల అధ్యక్షులు, పదాధికారులు సహా మొత్తం 800 మంది పాల్గొన్నారు. మహా సంపర్క అభియాన్ ద్వారా ప్రతి ఇంటికీ బీజేపీని ఏ విధంగా చేరువ చేయాలనే అంశంపై ఈ కార్యక్రమంలో అమిత్ షా చర్చించారు. బీజేపీ దేశ వ్యాప్తంగా ప్రారంభించిన సభ్యత్వ నమోదు ద్వారా ఇప్పటికే 11కోట్ల మందిని సభ్యులుగా చేర్చారు.
ఈ విధంగా కొత్తగా పార్టీ సభ్యత్వం తీసుకున్న సభ్యులందరినీ పార్టీలో క్రియాశీలక కార్యకర్తలుగా మార్చేందుకు గాను మహా సంపర్క అభియాన్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీలో చేరిన సభ్యులను క్రియాశీల కార్యకర్తలుగా తీర్చిదిద్దడంతో పాటు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది కాలంలో ప్రజల కోసం అమల్లోకి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు వీరికి శిక్షణ ఇవ్వనున్నారు. ఇక ఇదే సందర్భంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఏడాది పాలనపై ఆయా రాష్ట్రాల్లో ప్రజాభిప్రాయాన్ని సేకరించిన పదాధికారులు ఇందుకు సంబంధించిన నివేదికను అమిత్ షాకు అందజేశారు. ఇక త్వరలో జరగనున్న బీబీఎంపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సైతం బీజేపీ కర్ణాటక శాఖ నేతలకు అమిత్‌షా దిశా నిర్దేశం చేశారు.