మేము నోరు విప్పితే... దళపతి తట్టుకోలేరు.. | Our loyalty is still with JD(S), say rebel MLAs | Sakshi
Sakshi News home page

మేము నోరు విప్పితే... దళపతి తట్టుకోలేరు

Published Tue, Jun 14 2016 9:04 AM | Last Updated on Mon, Sep 4 2017 2:28 AM

మేము నోరు విప్పితే... దళపతి తట్టుకోలేరు..

మేము నోరు విప్పితే... దళపతి తట్టుకోలేరు..

బెంగళూరు : జేడీఎస్‌ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడపై తీవ్ర పదజాలంతో విమర్శలు గుప్పించారు. తమపై ఆరోపణలు మానకపోతే దేవెగౌడ గురించిన నిజాలు ప్రజలకు చెప్పాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించి శాసనమండలి, రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులకు ఓటేసినందుకు శాసనసభ్యులు జమీర్‌ అహ్మద్‌ఖాన్, చలువరాయస్వామి, బాలకృష్ణ, గోపాలయ్య, ఇక్బాల్‌ అన్సారి, రమేష్‌ బండి సిద్దేగౌడ, భీమానాయక్, అఖండశ్రీనివాస మూర్తిలను జేడీఎస్‌ పార్టీ సస్పెండ్‌ చేస్తూ ఆదివారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చలువరాయస్వామి నేతృత్వంలో వీరంతా నగరంలో సోమవారం ప్రత్యేకంగా సమావేశమమై తాజా పరిణామాలపై చర్చించారు.

అనంతరం చలువరాయస్వామి తన సహచర ఎమ్మెల్యేలతో కలిసి మీడియాతో మాట్లాడారు. పార్టీలో భిన్నాభిప్రాయాలు రావడానికి, తాము కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు ఓటెయ్యడానికి జేడీఎస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి ఏక పక్ష నిర్ణయాలే కారణమన్నారు. ఇప్పటి వకూ తమకు సస్పెన్షన్‌ నోటీసు అందలేదని అందువల్ల తాము ఈ క్షణం వరకూ జేడీఎస్‌ ఎమ్మెల్యేలమేనన్నారు.

‘మేము విప్‌ ఉల్లంఘించినందుకు పార్టీ నుంచి సస్పెన్షన్‌ వేటు వేసినట్లు దేవెగౌడ చెబుతున్నారు. అయితే 2006లో ముఖ్యమంత్రిగా  ఉన్న కుమారస్వామి పార్టీ జారీ చేసిన విప్‌ను ఉల్లంఘించారు. ఆయనకు మేము సహకారం కూడా అందించాం. అప్పుడు ఎందుకు ఆయన్ను, మమ్ములను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయలేదు. కుమారస్వామికి ఒక న్యాయం మాకో న్యాయమా ?’ అని ప్రశ్నించారు.


తమపై ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో అనవసర ఆరోపణలు చేయడం తగదన్నారు. తాము చనిపోయినట్లు పేర్కొని పెద్దకర్మ చేస్తున్నట్లు పోస్టర్లు వేయడం, కరపత్రాలు పంచడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. వీటినన్నింటిని చూస్తూ ఊరుకున్నామంటే దేవెగౌడపై ఉన్న గౌరవమే కారణమన్నారు. ఆయన వల్లే తాము రాజకీయంగా ఎదిగామని, వారి ఇంట్లో భోజనం చేశామన్న విశ్వాసం తమకు ఇప్పటికీ ఉందన్నారు. అందువల్లే తాము దేవెగౌడ గురించి కాని, ఆ కుంటుంబ సభ్యుల గురించి కాని ఎటువంటి వ్యాఖ్యలు చేయడం లేదన్నారు.

అలాకాక తాము నోరు విప్పితే నిజాలు బయటికి వస్తాయని వాటిని ఆ కుటుంబం తట్టుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా రోజుల నుంచి జేడీఎస్‌ అధినాయకత్వం ప్రతి విషయంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని వారు ఆరోపించారు. జేడీఎస్‌ పార్టీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఫరూక్‌ను ఎంపిక చేసే సమయంలో తమతో కాని మరి ఏ ఇతర ఎమ్మెల్యేలతో కాని అధినాయకత్వం మాట మాత్రమైనా చర్చించలేదన్నారు. అందువల్లే తాము కాంగ్రెస్‌ అభ్యర్థికి ఓటు వేయాల్సి వచ్చిందని రెబెల్‌ ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వడానికి ప్రయత్నించారు.

‘ఇప్పటి వరకూ పార్టీ నుంచి రాజ్యసభకు పంపించిన రామస్వామి, రాజీవ్‌ చంద్రశేఖర్, కుపేంద్రరెడ్డి జేడీఎస్‌ పార్టీ కార్యకర్తలా? ఎమ్మెల్సీలైన శరవణ, కే.వి నారాయనస్వామి పార్టీ కోసం కష్టపడిన వారా? వారికి ఎందుకు టికెట్లు ఇచ్చి గెలిపించినట్లు?’ అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement