
సాక్షి, తిరుపతి అర్బన్: వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనం కోసం వచ్చిన మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పూర్తిగా లెక్కలేనితనంతో వ్యవహరించిందని టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఓవీ రమణ మండిపడ్డారు. దేవెగౌడ విషయంలో టీటీడీ వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుబట్టారు. గురువారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక సీఎం కుమారస్వామి తిరుమలకు వచ్చిన సందర్భంగా అధికారులు రాష్ట్ర ప్రభుత్వ చనువు కారణంగా అతిపెత్తనం చేశారని విమర్శించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధానికి, కర్ణాటక సీఎంకు జరగాల్సిన ప్రోటోకాల్ మర్యాదలు జరగలేదన్నారు. పారిశ్రామికవేత్తలు, తమకు కావాల్సిన వారైతే తిరుమల జేఈవో స్వాగతం పలుకుతారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయమై జేఈవోతో మాట్లాడాలని మాజీ ప్రధాని ప్రయత్నిస్తే ఆయన తిరస్కరించడం సమంజసం కాదన్నారు. రాష్ట్రానికి అతిథులుగా వచ్చినవారిని అవమానించడం తగదన్నారు. స్థానిక పోలీసు ఎస్కార్ట్ కూడా లేకపోవడం నిర్లక్ష్యానికి పరాకాష్ట అని తప్పుపట్టారు. 86 ఏళ్ల మాజీ ప్రధానిని శ్రీవారి హుండీ దగ్గరే వదలి వెళ్లడం భద్రత లోపానికి నిదర్శనమన్నారు. మాజీ ప్రధానిగా దేవెగౌడ తిరుమలకు వచ్చిన ప్రతిసారి అధికారులు స్వాగతం పలకకుండా నిర్లక్ష్యం చేయడం పద్ధతి కాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment