సాక్షి, ముంబై: నగర ప్రజలు ఇకపై ఆర్టీవో కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన అవసరం లేదు. ఈ మేరకు ఆర్డీవో వెబ్‌సైట్ ద్వారా ఈ సమస్యలకు చెక్ పెట్టేలా అధికారులు వెసులుబాటు కల్పించారు. ఆన్‌లైన్‌లోనే లెసైన్స్, రిజిస్ట్రేషన్ తదితరాలకు సంబంధించిన రుసుము చెల్లించి వాటిని పొందవచ్చు. ముఖ్యమైన పనుల కోసం ప్రతి సారి పనులు వదులుకొని ఆర్టీవో కార్యాలయాల చుట్టూ తిరగడం ఇబ్బందిగా ఉంటోంది. వీరి సహాయార్థం ప్రయోగాత్మకంగా ఆన్‌లైన్ విధానం ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు.
దరఖాస్తు పత్రాలు కొనుగోలు చేయడం, రాయడం, వీటికి అవసరమైన పత్రాలు జోడించడం వంటివే కాకుండా ఆ కార్యాలయాల చుట్టూ తిరగడం క్లిష్టమైన ప్రక్రియ అని నగర వాసులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఆర్టీవో కూడా ఈ వ్యయప్రయాసలకు స్వస్తి పలకనుంది. ఆర్టీవో కార్యాలయంలో ఒక్కరోజులో కావల్సిన పనులు కావడం లేదు. ఏ చిన్న పత్రం మరిచిపోయినా కూడా మళ్లీ మరుసటి రోజు వెళ్లాలి. అందుకే ఆన్‌లైన్ విధానం ప్రవేశపెడుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఆన్‌లైన్‌లో ఈ వెబ్‌సైట్ నిర్వహించేందుకు అధికారులతో ఇటీవలే సమావేశం కూడా ఏర్పాటు చేశారు.
సిబ్బందికి కూడా మేలే..
ఈ ప్రక్రియ వల్ల వినియోగదారులకు వ్యయప్రయాసలు తప్పడమే కాకుండా కార్యాలయంలో సిబ్బందికి కూడా పని ఒత్తిడి తగ్గుతుందని చెబుతున్నారు. అయితే జాతీయంగా గుర్తింపు పొందిన బ్యాంకులు, ఏజెన్సీలతో సమావేశమై అన్ని లావాదేవీలు ఆన్‌లైన్‌లోనే జరిగేలా సరికొత్త వ్యవస్థను రూపొందిచేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు అధికారులు తెలిపారు. మొత్తం వ్యవస్థను కంప్యూటరైజ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తత్ఫలితంగా రవాణా విభాగంలో అన్ని లావాదేవీలు ఆన్‌లైన్ ద్వారానే నిర్వహించే వీలు ఉంటుందని పేర్కొన్నారు. వివిధ ఆర్టీవో కార్యాలయాల్లో లర్నింగ్ లెసైన్సుకోసం దరఖాస్తు చేసుకునేందుకు అపాయింట్‌మెంట్ కూడా తీసుకోవడం ఆన్‌లైన్‌లోనే జరుగుతోందన్నారు.
కొత్త వాహన రిజిస్ట్రేషన్, ఫిజికల్ ఫిట్‌నెస్‌ను తనిఖీ చేయడం, పరీక్షించడం మినహా మిగిలిన విధానం మొత్తం ఆన్‌లైన్‌లోనే జరిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాకుండా ఆన్‌లైన్ విధానం ప్రవేశపెట్టడం ద్వారా వివిధ ఆర్టీవో కార్యాలయాల ముందున్న ఉన్న ఏజెంట్లకు, అలాగే సంబంధిత అధికారులకు పనులు త్వరితగతిన జరిగేందుకు లంచం ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదని పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఆర్టీవో కార్యాలయాలు సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్నాయి. అన్ని ఆన్‌లైన్ ద్వారా చేయడం ప్రారంభిస్తే అన్ని వివరాలు సింగిల్ డిజిటల్ కార్డులో ప్రింట్ అవుతాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
ఇక ఆన్‌లైన్‌లోనే లెసైన్స్‌లు
Published Thu, May 7 2015 4:10 AM | Last Updated on Sun, Sep 3 2017 1:33 AM
Advertisement