ఒంటరైన అమర్ నాథ్ రెడ్డి | palamaner mla amarnath reddy expected ministry | Sakshi
Sakshi News home page

ఒంటరైన అమర్ నాథ్ రెడ్డి

Published Mon, Oct 24 2016 12:00 PM | Last Updated on Tue, Oct 30 2018 4:01 PM

ఒంటరైన అమర్ నాథ్ రెడ్డి - Sakshi

ఒంటరైన అమర్ నాథ్ రెడ్డి

చిత్తూరు: జిల్లాలోని ఏకైక ఫిరాయింపు ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి మంత్రి పదవిపై ఆశలు వదులుకున్నారా? టీడీపీలో ఆయన ఒంటరి అయ్యారా? అధికారులు కూడా ఆయన వినతులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదా? 2019 జరిగే ఎన్నికల్లో కూడా ఆయనకు టీడీపీ టికెట్‌ ఇచ్చే అవకాశం లేదా? ఒకవేళ ఇచ్చినా గెలిచే అవకాశాలు సన్నగిల్లినట్లేనా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది టీడీపీలోని కొన్ని వర్గాల నుంచి. దీంతోనే దాదాపుగా ఆయన ఇంటికే పరిమితమయ్యారని ఆ పార్టీ నాయకులు అనుకుంటున్నారు.
 
పార్టీ అధిష్టానం కూడా పలమనేరు ఇన్‌చార్జ్‌ సుభాస్‌ చంద్రబోస్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటంతో ఆయన రాజకీయ భవిష్యత్‌పై సందేహ పడుతున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. వైఎస్సార్‌సీపీ నుంచి ఆయనతో టీడీపీలో చేరిన కార్యకర్తలు కూడా రెండోరోజు నుంచే ఒక్కొక్కరు ఆయనను వదలి సొంత గూటికే చేరుతున్నారు. అధికారులు కూడా ఆయన చెప్పిన పనులను పక్కన పెడుతుండటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. 
 
బోస్‌కే ప్రాధాన్యం
ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా అధికార టీడీపీ ఆపరేషన్‌ ఆకర్‌్షకు తెరలేపింది. ఈ వలలో అమర్‌నాథ్‌రెడ్డి తేలికగా పడ్డారు. వైఎస్సార్‌ సీపీ విప్‌గా ఉంటూనే పార్టీ ఫిరాయించారు.  మంత్రిపదవి ఆశ, జిల్లాను మొత్తం శాసించవచ్చనే ఒక కోరికతో ఆయన తెలుగుదేశం గూటికి జంప్‌ అయ్యారు. పార్టీలో చేరిన కొన్నాళ్లకే అమర్‌కు అసలు తత్వం బోధపడింది. టీడీపీ  కేడర్‌ మొత్తం ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బోస్‌కే అండగా నిలుస్తోంది. అధికారులు కూడా బోస్‌ చెప్పిన పనులకే ‘ఊ ’ కొడుతుండటం కూడా అమర్‌కు మింగుడు పడటం లేదు. తొలిరోజుల్లో ఇలాంటి పరిస్థితులు చూసి తనకు మంత్రి పదవి వస్తే అధికారులు, పార్టీ నాయకులు సరెండర్‌ అవుతారని అనుచరులతో చెప్పుకునేవారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చే అవకాశం లేదని వార్తలు వస్తుండటంతో ఆయన పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. ఈ పరిస్థితిని జిల్లా నాయకులకు చెప్పుకుంటే అవహేళన చేస్తారనే ఉద్దేశంతో ఆయన గుంభనంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చింది కాబట్టే అమర్‌ పార్టీలోకి వచ్చారని ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు అంటున్నారు. కష్టకాలంలో పార్టీని వదలి వెళ్లిన అమర్‌ను ఎంత మాత్రం ప్రోత్సహించమని వారు అంతర్గతంగా చెప్పుకుంటున్నారు. టీడీపీలో చూపించిన బుద్ధే వైఎస్సార్‌సీపీలోనూ చూపించారని, ఆయన వైఖరే అంత అని పార్టీ అధిష్టానానికి కూడా చేరవేశారని తెలుస్తోంది. తన మనుగడ, స్వప్రయోజాల కోసం పార్టీలోకి తిరిగి వచ్చిన అవకాశవాది అమర్‌నా«థ్‌రెడ్డికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని టీడీపీ అధిష్టానానికి పలమనేరు కేడర్‌ కుండబద్ధలు కొట్టినట్లు విశ్వసనీయ సమాచారం. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement