ఏ తల్లిదండ్రుల కర్కశత్వమో ..
► రోడ్డు పక్కన ఆడశిశువు
► ఏ తల్లి కన్నబిడ్డో
► చింతామణిలో అమానుషం
చింతామణి: వెచ్చగా కన్నతల్లి పొత్తిళ్లలో ఆడుకోవాల్సిన శిశువు రోడ్డుపాలైంది. బొడ్డూడని పసికందు అప్పుడే అనాథగా మారింది. ఏ తల్లిదండ్రుల కర్కశత్వమో ఆమెను చెత్తకుప్ప పాలుజేసింది. ఒక రోజు కిందటే పుట్టిన ఆడశిశువును ఎవరో వదిలివెళ్లిన అమానవీయ సంఘటన రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జోడిహొసహళ్లి బస్సు క్రాసు దగ్గర శనివారం వెలుగు చూసింది. ప్రభుత్వాలు ఆడబిడ్డలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి వారి సంరక్షణకు ఎంతో కృషి చేస్తున్నా ఆడపిల్లల పట్ల చులకనభావం తొలగిపోవడం లేదు. ఆడపిల్లంటే ఇంటికి లక్ష్మిదేవి అని ఆనందించాల్సింది పోయి గుండెలమీద కుంపటిలా కొందరు భావిస్తున్నారు. ఇలాంటిదే ఈ ఘటన.
శనివారం ఉదయం హొసహళ్లి క్రాస్ దగ్గర ఉన్న దుకాణాన్ని తీయడానికి వచ్చిన యజమాని మునిరెడ్డి బస్సు షెల్టర్‌లో సంచి ఉండడం గమనించి దగ్గరకు వెళ్లి చూడగా, పసిబిడ్డ ఏడుపు వినిపించింది. ఆయన, గ్రామస్థులు సంచి తీసి చూడగా నవజాత ఆడశిశువు కనిపించింది. 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. చింతామణి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొని వచ్చి ప్రథమ చికిత్స నిర్వహించి, అనంతరం పిల్లల సంరక్షణ సహాయవాణి సిబ్బంది ఆంజప్ప, సునీత పాపను జిల్లాస్పత్రికి తీసుకెళ్లారు. పాప తల్లిదండ్రుల కోసం పోలీసులు, అధికారులు గాలిస్తున్నారు.