అహ్మదాబాద్ నాకు కొత్త కాదు!
Published Sat, Apr 12 2014 10:21 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
న్యూఢిల్లీ: తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు, అహ్మదాబాద్ (తూర్పు) లోక్‌సభ స్థానం బీజేపీ అభ్యర్థి పరేష్ రావల్ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు. తాను స్థానికుణ్ని కాదన్న ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొడుతూ, అహ్మదాబాద్ తనకు కొత్త కాదని చెబుతున్నారు. రాజకీయాలు పరేష్ రావల్‌కు కొత్త కాకపోయినా ఎన్నికల్లో పోటీచేయడం మాత్రం ఆయనకు ఇదే మొదటిసారి. అహ్మదాబాద్ నుంచి ఏడు సార్లు లోక్‌సభకు ఎన్నికైన హరేన్ పాఠక్‌ను కాదని బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ పరేష్‌కు టికెట్ ఇప్పించడం విశేషం. నరేంద్ర మోడీని ప్రధాన మంత్రిని చేయాలన్న ఉద్దేశంతో తాను ఎన్నికల బరిలోకి దిగినటు ఆయన చెబుతున్నారు. 15.60 లక్షల ఓటర్లున్న అహ్మదాబాద్ స్థానం బీజేపీకి కంచుకోటే. అయితే స్థానిక నాయకుడు పాఠక్‌ను కాదని, ముంబైవాసిగా ముద్రపడిన పరేష్‌ను నిలబెట్టడంపై స్థానికంగా వ్యతిరేకత ఉంది.
ఈ సీనియర్ నటుడు మాత్రం తాను అహ్మదాబాద్‌కు కొత్తవాడిని కాదని అంటున్నారు. గుజరాతీ కుటుంబానికి చెందిన పరేష్ ముంబైలోనే చదువుకొని నటుడిగా ఎదిగారు. 1979లో మిస్ ఇండియాగా ఎన్నికైన స్వరూప్ సంపత్ పరేష్ రావల్ భార్య. జాతీయ సినిమా అవార్డుతోపాటు, పద్మశ్రీ అందుకున్న పరేష్ సర్దార్ చిత్రంలో పోషించిన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ పాత్రతో గుజరాతీలకు దగ్గరయ్యారు. వెండితెరపై నరేంద్ర మోడీ పాత్ర పోషించాలని ఉందని చెప్పే పరేష్‌ను నరేంద్ర మోడీకి సన్నిహితుడిగా పేర్కొంటారు. 2012లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రచారం చేశారు. ఈసారి గుజరాత్ నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులందరిలోకెల్లా పరేష్ రావల్ సంపన్నుడని తేలింది. తన కుటుంబానికి రూ.79.40 కోట్ల ఆస్తులున్నట్లు పరేష్ రావల్ ప్రకటించారు. పరేశ్ రావల్ తెలుగులో క్షణక్షణం, మనీ మనీ, శంకర్‌దాదా ఎంబీబీఎస్ వంటి సినిమాల్లో నటించారు.
Advertisement
Advertisement