ప్రశాంతంగా గ్రూప్-4 పరీక్ష
Published Mon, Aug 26 2013 6:11 AM | Last Updated on Fri, Sep 1 2017 10:08 PM
రాష్ట్రంలో గ్రూప్-4 పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. అన్నకు బదులు తమ్ముడు పరీక్షకు హాజరై అధికారులకు దొరికిపోయూడు. అధికారుల నిర్లక్ష్యంతో 200 మంది అభ్యర్థులు అవస్థలు పడాల్సి వచ్చింది.
సాక్షి, చెన్నై: రాష్ట్ర ప్రభుత్వశాఖల్లో 5566 గ్రూప్-4 పోస్టుల భర్తీకి టీఎన్‌పీఎస్‌సీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ పోస్టులకు విద్యార్హతగా పదో తరగతిని నిర్ణయించింది. దీంతో అభ్యర్థుల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఆగస్టు 25న పరీక్ష నిర్వహణకు చర్యలు తీసుకున్నారు. గత అనుభవాల దృష్ట్యా ఈ పర్యాయం నిఘానీడలో పరీక్ష నిర్వహిం చేందుకు టీఎన్‌పీఎస్‌సీ వర్గాలు చర్యలు తీసుకున్నాయి. రాష్ట్రంలో 224 ప్రాంతాల్లోని 4755 కేంద్రాల్లో ఆదివారం పరీక్ష జరిగింది.
14 లక్షల మంది హాజరు: గ్రూప్-4 పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 14 లక్షల మంది హాజరయ్యూరు. ఉదయాన్నే అభ్యర్థులు కేంద్రాలకు తరలివచ్చారు. చంటి బిడ్డలతో కొందరు పరీక్ష రాయడానికి వచ్చారు. విద్యార్హత పదో తరగతి అయినా పీజీలు చేసిన వాళ్లు సైతం పరీక్షకు హాజరుకావడం గమనార్హం. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. టీఎన్‌పీఎస్‌సీ చైర్మన్ నవనీత కృష్ణన్ నేతృత్వంలో 4,755 మంది చీఫ్ సూపర్‌వైజర్లు, 70,230 మంది సూపర్‌వైజర్లు, 4500 మంది తనిఖీ అధికారులు, 950 మంది ఫ్లైయింగ్ స్క్వాడ్ సిబ్బంది పరీక్ష సరళిని పర్యవేక్షించారు. ప్రతి కేంద్రంలో పరీక్ష నిర్వహణను వీడియో తీశారు. కేంద్రాలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించారు. పరీక్ష ఫలితాలు అక్టోబరు చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది.
అన్నకు బదులు తమ్ముడు
ఓ కేంద్రంలో అన్నకు బదులుగా పరీక్ష రాయడానికి వచ్చిన తమ్ముడ్ని ఇన్విజిలేటర్ పట్టుకున్నాడు. సేలం కంకణాపురం నాచ్చియప్ప పాఠశాల కేంద్రంలో సత్యనారాయణ (30) పరీక్ష రాయడానికి వచ్చాడు. తనిఖీల అనంతరం అతడ్ని లోపలకు అనుమతించారు. అయితే ఇన్విజిలేటర్ పళనిస్వామికి అనుమానం కలిగింది. అతడ్ని మరోమారు పరిశీలించారు. అతడి హాల్‌టికెట్‌లో ఉన్న ఫొటోను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతం గదమాయించడంతో అసలు విషయం బయటపడింది. అన్నదమ్ముళ్లు ఒకేలా ఉండడంతో అన్న తిరు వెంగడానికి బదులు తమ్ముడు సత్యనారాయణ పరీక్ష రాయడానికి వచ్చి పట్టుబడ్డాడు. నిందితుడిని పోలీసులకు అప్పగించారు. కన్యాకుమారి జిల్లాలో గందరగోళం ఏర్పడింది. నాగుర్ కోవిల్‌లో ఉన్న కేంద్రాన్ని కన్యాకుమారి రోడ్డు అని పేర్కొనడంతో 200 మంది అభ్యర్థులు ఇబ్బందులకు గురయ్యారు. అధికారులు ప్రత్యేక వాహనాల్ని ఏర్పాటు చేసి అభ్యర్థులను సకాలంలో సంబంధిత కేంద్రానికి చేర్చారు.
Advertisement
Advertisement