
శాంతి భద్రతలపై
అట్టుడికిన సభ
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో శాంతి భద్రతలు అధ్వానంగా తయారయ్యాయని, సీనియర్ పోలీసు అధికారుల మధ్య నెలకొన్న విభేదాలు రచ్చకెక్కాయని ప్రతిపక్షాలు బుధవారం శాసన సభలో ప్రభుత్వంపై ధ్వజమెత్తాయి. కోరమంగలలో పోలీసు సిబ్బంది రాస్తారోకో చేయడం, గుల్బర్గలో రౌడీ కాల్పుల్లో ఎస్‌ఐ మల్లిఖార్జున బండె మరణించడంపై కూడా విపక్షాలు అస్త్రాలు సంధించాయి.
ఉదయం సభ ప్రారంభం కాగానే బీజేపీ సభ్యుడు ఆర్. అశోక్ మాట్లాడుతూ... రాష్ర్టంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపించారు. అదనపు డీజీపీ రవీంద్ర నాథ్ వ్యవహారం ద్వారా పోలీసు శాఖలో ఎవరి మాటను ఎవరూ పట్టించుకోరని తేలిందని విమర్శించారు. ఈ దశలో హోం మంత్రి కేజే. జార్జ్‌తో పాటు శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి టీబీ. జయచంద్ర, ఉన్నత విద్యా శాఖ మంత్రి ఆర్‌వీ. దేశ్ పాండేలు అశోక్‌పై ధ్వజమెత్తారు.
ఈ సందర్భంగా పాలక, ప్రతిపక్ష సభ్యుల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభ హోరెత్తింది. శాంతి భద్రతలపై చర్చించడానికి వాయిదా తీర్మానాన్ని అనుమతించాలని అశోక్ స్పీకర్ కాగోడు తిమ్మప్పను కోరారు. ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్, అశోక్‌కు మద్దతుగా నిలిచారు. ప్రశ్నోత్తరాల అనంతరం దీనిపై చర్చకు అవకాశమిస్తానని స్పీకర్ హామీ ఇచ్చారు. వాయిదా తీర్మానం గురించి ప్రస్తావించడానికి అవకాశం ఇవ్వాలని శెట్టర్ కోరారు.
బీజేపీ సభ్యులు, జేడీఎస్ పక్షం నాయకుడు కుమారస్వామి ఆయనకు మద్దతుగా నిలిచారు. దీంతో స్పీకర్ ఆ అంశాన్ని ప్రస్తావించడానికి అవకాశం ఇచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్‌పై రవీంద్ర నాథ్ ఆరోపణలు చేయడం, కాఫీ షాపులో మహిళ ఫొటో తీశారనే ఆరోపణపై రవీంద్ర నాథ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు 1,200 మందికి పైగా కేఎస్‌ఆర్‌పీ సిబ్బంది రోడ్డుకెక్కి ఆందోళన చేయడం, మంగళూరులో ఖైదీల మధ్య ఘర్షణ...లాంటి సంఘటనలను అశోక్ ప్రస్తావించారు.
తద్వారా పోలీసు శాఖపై ఎవరికీ నియంత్రణ లేదని తేలిపోయిందని ఆరోపించారు. ఈ సందర్భంగా స్పీకర్ జోక్యం చేసుకుంటూ దీనిపై స్వల్ప వ్యవధి చర్చకు అవకాశం ఇస్తానని చెప్పడంతో సభా కార్యకలాపాలు యథావిధిగా ప్రారంభమయ్యాయి.