టీనగర్:
శ్రీలంక తమిళులకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కె.వెంకయ్య నాయుడు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రైతు సంక్షేమం అంటూ మొసలి కన్నీరు కారుస్తోందని విమర్శించారు. బీహార్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి గెలుపొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వెంకయ్యనాయుడు శనివారం చెన్నై విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. శ్రీలంక తమిళుల సమస్యలో శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు కేంద్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని దీనికి సంబంధించి ప్రధాని మోదీ శ్రీలంక అధ్యక్షుడు సిరిసేనతో చర్చలు జరుపుతున్నారని అన్నారు. అక్కడ శాశ్వత పరిష్కారం లభించాలంటే రాజీవ్-జయవర్దనే ఒప్పందం ప్రకారం 13వ చట్ట సవరణను శ్రీలంకలో పూర్తిగా అమలు జరపాలన్నారు. అలా జరిగిన పక్షంలో అక్కడి తమిళులు సమాన హక్కులు, హోదాతో జీవించే ఆస్కారం ఉంటుందన్నారు.
అం దువల్ల 13వ చట్ట సవరణను ఖచ్చితంగా అమలు జరపాలంటూ ఒత్తిడి తెస్తున్నట్లు పేర్కొన్నారు. భారత జాలర్ల సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. శ్రీలంకలో జరిగిన యుద్ధ నేరాల గురించి అంతర్జాతీయ విచారణ జరపాలనే విషయంపై కేంద్ర ప్రభుత్వ వైఖరి గురించి ప్రస్తుతం చెప్పలేమని, తగిన సమయంలో మోడీ సరైన నిర్ణయాన్ని తీసుకుంటారన్నారు. కాంగ్రెస్ మొసలి కన్నీరు: రైతు సంక్షేమం పేరిట కాంగ్రెస్ పార్టీ మొసలి కన్నీరు కారుస్తోందని వెంకయ్య నాయుడు విమర్శించారు. ఇటీవలి ప్రధాని మోదీ అమెరికా పర్యటన విజయవంతమైందని, విదేశీ పారిశ్రామికవేత్తలు పలువురు దేశంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారని తెలిపారు. దీంతో దేశంలో పారిశ్రామికాభివృద్ధి జరిగి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు.
అదే విధంగా అనేక మంది స్వదేశీ పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు స్థాపించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు జరుపుతోందన్నారు. వారి పరిశ్రమల స్థాపనకు విస్తారమైన స్థలాలు కావాలని, అందువల్ల కేంద్ర ప్రభుత్వం భూసేకరణ చట్టాన్ని తీసుకొచ్చేందుకు ఆసక్తితో ఉందన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ దీనికి అడ్డుగా ఉందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా ఆంధ్ర, కర్ణాటక, హర్యానా రాష్ట్రాల్లో వ్యవ సాయ భూములను ఎటువంటి నష్టపరిహారం చెల్లించకుండా స్వాధీనం చేసుకున్నారన్నారు. అటువంటి కాంగ్రెస్ నే డు రైతుల కోసం మొసలికన్నీరు కారుస్తోందని ఎద్దేవా చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి గెలుపొందుతుందని, సేతు సముద్ర పథకాన్ని ప్రత్యామ్నాయ మార్గంలో అమలుచేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిపారు.
శ్రీలంక తమిళులకు శాశ్వత పరిష్కార ం
Published Sun, Sep 27 2015 2:18 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement