'ప్రతిపక్ష నేత పదవి కోసం ప్రజలు ఎన్నుకోలేదు'
న్యూఢిల్లీ: ప్రతిపక్ష నేత విషయంలో కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేస్తూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విమర్శలు చేశారు. ఆ పదవి కోసం ప్రజలు ఒక పార్టీని ఎన్నుకోలేదని ఎద్దేవా చేశారు. ప్రజా తీర్పు స్ఫూర్తిని కాంగ్రెస్ ఇంకా అర్థం చేసుకోలేకపోతోందన్నారు. ఓటమిపై ఆ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు వెంకయ్యనాయుడు సోమవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ఏ పార్టీ అయినా 55లోక్‌సభ స్థానాలు గెలుచుకుని ఉంటే విపక్షనేత స్థానంపై చర్చే ఉండేది కాదని, ఈ విషయంలో స్పీకర్‌కు ప్రత్యేకాధికారాలు ఉన్నాయని ఆయన చెప్పారు.
ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ విమర్శలను విలేకరులు వెంకయ్యనాయుడు వద్ద ప్రస్తావించగా... బలమైన, స్థిరమైన దేశం కోసం సరైన మార్గంలో సరైన ప్రాధాన్యతలు, సరైన విధానాలను రాష్ట్రపతి ప్రసంగం తెలియజేసిందన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో వచ్చే రెండు రోజుల్లో చర్చ ఉంటుందని తెలిపారు.