- రెండు రోజులుగా భోజనాలు బంద్
- ఆకలితో అలమటిస్తున్న విద్యార్థులు
రాయచూరు : గుల్బర్గా వర్సిటీకి అనుబంధంగా స్థానిక శివారు ప్రాంతంలోని జ్ఞానతుంగ స్నాతకోత్తర కేంద్రం హాస్టల్‌లో ఆకలికేకలు మార్మోగుతున్నాయి. హాస్టల్ అస్తవ్యస్త నిర్వహణ కారణంగా రెండు రోజులుగా విద్యార్థులు ఆకలిదప్పులతో అలమటిస్తున్నారు. నీటి సౌకర్యం లేక రెండు రోజులుగా స్నానాలకు కూడా నోచుకోవడం లేదు. హాస్టల్‌లో వివిధ జిల్లాల నుంచి వచ్చిన 130 విద్యార్థులు, 10 విద్యార్థినిలు వసతి పొందుతున్నారు.
ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి టిఫిన్లు, భోజనాల కోసం టెండర్లు పిలిచి కంట్రాక్టు ఇచ్చారు. కాంట్రాక్టర్ అందజేస్తున్న భోజనంలో నాణ్యత లేదని రెండు రోజుల క్రితం విద్యార్థులు ఆరోపించడంతో కాంట్రాక్టర్ ఏకంగా భోజనాలు వడ్డించడం మానేశారు. దీంతో విద్యార్థులు బయటి హోటళ్లను ఆశ్రయించారు. జేబులు ఖాళీ కావడంతో దాదాపు 80 మంది స్వగ్రామాలకు వెళ్లిపోగా 40 విద్యార్థులు ఒక్కొక్కరు 20 రూపాయలు చందా వేసుకొని ఒకపూట భోజనం ఏర్పాటు చేసుకున్నారు.
ఈ విషయంపై హాస్టల్ ప్రత్యేక అధికారి, ఇంచార్జి వార్డెన్‌ను వివరణ కోరగా తన నిస్సాహాయతను వ్యక్తం చేశారు. ఆ కేంద్రం ప్రత్యేక అధికారి భాస్కర్ మాట్లాడుతూ కాంట్రాక్టర్‌తో వివాదం ఫలితంగానే విద్యార్థుల ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఈ విషయంలో చట్టరీత్య చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. విషయాన్ని కలెక్టర్ శశికాంత్ సెంథిల్ దృష్టికి తీసుకెళ్లగా గుల్బర్గ విశ్వవిద్యాలయం కులపతితో మాట్లాడి భోజన ఇతర వసతులకు అత్యవసర ఏర్పాట్లు చేయాలని కోరతానన్నారు.