మున్సిపల్ కార్పొరేషన్‌కు పాతనోట్ల పంట
Published Thu, Nov 24 2016 4:17 PM | Last Updated on Mon, Sep 4 2017 9:01 PM
ముంబై: పాత పెద్ద నోట్ల రద్దుతో పింప్రి మున్సిపల్ కార్పొరేషన్ దశ తిరిగింది. గత 13 రోజుల నుంచి ఈ కార్పొరేషన్ ఖజానాకు ఆస్తి పన్ను రూపంలో రూ.130 కోట్లు వచ్చి చేరాయి. కేంద్రం నోట్ల రద్దు ప్రకటించిన రెండు రోజులకే పింప్రీ మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) పన్ను చెల్లింపులో పాత నోట్లను అంగీకరిస్తామని ప్రకటించింది. ఇందుకోసం నగరవ్యాప్తంగా 15 కార్యాలయాలను ఏర్పాటు చేసి, 200 మంది సిబ్బందిని మోహరించింది. రెండు ప్రైైవేట్ బ్యాంక్‌లకు పన్ను వసూలు అధికారాన్ని కూడా కల్పించింది. దీంతో బుధవారం గడువు ముగిసేటప్పటికి రూ.130 కోట్ల నగదు పన్నుల రూపంలో జమ అయింది.
ప్రజల స్పందన భారీగా ఉండటంతో ఈ డ్రైైవ్‌ను ఈ నెల 30 వరకు కొనసాగించాలని అధికారులు భావిస్తున్నారు. అయితే, పెండింగ్ పన్నులను బకాయి దారులు తమ వద్ద ఉన్న బ్లాక్ మనీతో చెల్లిస్తున్నారన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ చెల్లింపులపై దర్యాప్తు చేపట్టాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. పీఎంసీ ఆస్తి పన్ను విభాగ అధికారి సుహాస్ మపారి మాట్లాడుతూ.. కేవలం 13 రోజుల్లో తాము రూ.130 కోట్లు నగదు రూపంలో పొందగా, చెక్కులు, డిమాండ్ డ్రాఫ్ట్‌ల రూపంలో కలిపి రూ. 910 కోట్ల వరకు వచ్చాయని తెలిపారు. అయితే, ఐటీ విభాగం కోరిక మేరకు.. చెల్లింపుదారుల వివరాలన్నిటినీ వారికి అందించామని వెల్లడించారు.
Advertisement
Advertisement