సాక్షి, బళ్లారి : జిల్లాలోని అన్ని గ్రామాల్లో వేసవిలో నీటి ఎద్దడి నివారణకు ప్రణాళికలు రూపొందించినట్లు జిల్లా ఇన్‌చార్జి మంత్రి పరమేశ్వర్ నాయక్ పేర్కొన్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గురువారం జిల్లాకు విచ్చేసిన ఆయన నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు.
బళ్లారికి మంచినీటిని అందించే అల్లీపురం రిజర్వాయర్‌లో నీటి సేకరణ తక్కువగా ఉన్నందున భవిష్యత్తులో ఎలాంటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారికి సూచనలు ఇచ్చామన్నారు. కుడితిని, మించేరి గ్రామాల్లోని చెరువు పనులు పూర్తి చేసి తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మంచినీటి సమస్యల పరిష్కారానికి నిధుల కొరత లేదని, గ్రామ పంచాయతీల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి నీటి సమస్యపై దృష్టి సారించాలని ఆదేశించినట్లు తెలిపారు.
ఆర్టికల్-371(జే) త్వరలో అమల్లోకి వస్తుందని,దీంతో జిల్లాలో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. కరువు ప్రాంతాలుగా ప్రకటించిన జిల్లాలోని ఆరు తాలూకాల్లో కరువు నివారణ పనులు చేపట్టి కూలీలు వలసలు నివారించి జిల్లాలో అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామన్నారు.
అల్లీపురం రిజర్వాయర్ స్థితిగతులపై మంత్రికి ఎస్‌యూసీఐ వినతి: ఇదిలా వేసవిలో బళ్లారిలో నీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని ఎస్‌యూసీఐ ప్రముఖులు సోమశేఖర్, మంజుల, దేవదాసు, ప్రమోద్ మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు.
కుదించుకుపోయిన అల్లీపురం రిజర్వాయర్ రక్షణ గోడ పనులు ఆలస్యంగా ప్రారంభం కావడంతో 7.5 మీటర్లకుగాను 4.5 మీటర్లు మాత్రమే నీటిని నిల్వ చేశారని, దీంతో నీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉందని మంత్రికి వివరించారు. రిజర్వాయర్ పనులు పూర్తి స్థాయిలో చేపట్టాలని కోరారు. జిల్లాలో ప్రభుత్వాస్పత్రుల్లో సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి మాట్లాడుతూ బళ్లారి నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా మంచినీటి సమస్య రాకుండా చూస్తానని, ప్రభుత్వ ఆస్పత్రిలో సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
అల్లీపురం రిజర్వాయర్ పరిశీలన : ఎనిమిది నెలల క్రితం గట్టు కుప్పకూలిన అల్లీపురం రిజర్వాయర్‌ను జిల్లా ఇన్‌చార్‌జ మంత్రి పరమేశ్వరనాయక్ గురువారం మొదటిసారిగా పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఆదిత్య అమ్లాన్ బిస్వాస్, సంబంధిత అధికారులతో కలిసి రిజర్వాయర్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ గట్టుకు పూర్తి స్థాయిలో మరమ్మత్తులు చేపట్టి మంచినీటి సమస్య రాకుండా చూస్తామన్నారు. నీటి మట్టం 2.5 మీటర్లు తక్కువ ఉన్నందున డిసెంబర్ 26 వరకు రిజర్వాయర్‌లోకి నీరు పంప్ చేసి ఏప్రిల్ నుంచి నీరు సరఫరా చేస్తామన్నారు. అంతవరకు మోకా కాలువ ద్వారా నగరానికి మంచినీరు అందిస్తామన్నారు. నగర కమిషనర్ చిక్కణ్ణ, కాంగ్రెస్ నాయకులు రాంప్రసాద్, కార్పొరేటర్ వెంకట రమణ పాల్గొన్నారు.
వేసవిలో నీటి ఎద్దడి నివారణకు ప్రణాళిక
Published Fri, Dec 13 2013 3:06 AM | Last Updated on Sat, Sep 2 2017 1:32 AM
Advertisement
Advertisement