‘ప్లాస్టిక్’తో అందాలు | 'Plastic' beauty | Sakshi
Sakshi News home page

‘ప్లాస్టిక్’తో అందాలు

Published Sat, Feb 28 2015 1:42 AM | Last Updated on Sat, Sep 2 2017 10:01 PM

'Plastic' beauty

కోటేరు లాంటి ముక్కు... నవ్వితే దానిమ్మ గింజల్లా మెరిసిపోయే పలువరుస... సిగ్గుపడితే బుగ్గనసొట్ట... ఇలాంటి అందమైన ఆకృతి వద్దనుకునే అమ్మాయిలు ఏవరైనా ఉంటారా? కచ్చితంగా ఉండరు కాగా ఉండరు. పుట్టుకతోనే ఇంతటి సౌందర్య లక్షణాలు సంక్రమించకపోతే! అయితే అందంగా కనిపించే భాగ్యం మనకు లేదా? వీటన్నింటికి సమాధానమిస్తోంది ఆధునిక వైద్య విజ్ఞానం.

ఔను ప్రస్తుతం ముఖారవిందాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీ ఒక్కటే మార్గం కావడంతో చాలా మంది ఆ దిశగా ప్రయాణం చేస్తున్నారు. కొంత కాలం క్రితం వరకు కేవలం సెలబ్రిటీలకే పరిమితమైన ఈ సర్జరీ విధానం ప్రస్తుతం అందరికీ అందుబాటులోకి వచ్చింది. మెట్రో యువతుల్లో రోజురోజుకూ ఈ ప్లాస్టిక్ సర్జరీపై క్రేజ్ పెరుగుతోంది. అమ్మాయిలే కాదండి... అబ్బాయిలు కూడా ఇలాంటి సర్జరీలపై మక్కువ చూపుతుండడం గమనార్హం.  
 - సాక్షి, బెంగళూరు
 
ముక్కుపై మక్కువ...
 
ప్రస్తుతం బెంగళూరులాంటి మహానగరాల్లో ప్లాస్టిక్ సర్జరీల ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తోంది. తమ ఆకృతిని మార్చుకునేం దుకు ప్లాస్టిక్ సర్జరీల వైపు చూస్తున్న యువతుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. వీరిలో ఎక్కువ శాతం మంది వివాహానికి ముందు ఇలాంటి సర్జరీలపై ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. ఎక్కువగా రినోప్లాస్టీ (ముక్కుకు సర్జరీ) చేయించుకోవడంపై చాలా మంది శ్రద్ధ కనబరుస్తున్నట్లు వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కాస్త లావుగా ఉన్న ముక్కును చెక్కేసి స న్నగా కోటేరులా తీర్చిదిద్దుతున్నారు. ఇందు కోసం సర్జరీ చే యించుకునే వారి శరీరంలో ఏదో ఒక భాగం నుంచి కణజాలా న్ని సేకరిస్తారు. ఒక వేళ ఆ కణజాలం వారికి సరిపోకపోతే రక్తసంబంధీకుల నుంచి కణజాలాన్ని సేకరించి సర్జరీ చేసిన చోట ఆ కొత్త కణజాలాన్ని పరచి ఆకృతినే మార్చేస్తున్నారు. ‘ఒక మనిషి అందాన్ని నిర్ణయించడంలో ముక్కు ప్రముఖ పాత్ర వహిస్తుంది. ముక్కు చక్కగా, నాజుకుగా ఉంటే మనల్ని మనం కొత్తగా ఆవిష్కరించుకోవచ్చు. అందుకే ఎక్కువ మంది అమ్మాయిలు రినోప్లాస్టీపై మక్కువ చూపుతున్నారు. వివాహాలు నిశ్చయమైన అమ్మాయిలను వారి తల్లిదండ్రులే పిలుచుకొచ్చి ఈ తరహా సర్జరీలు చేయిస్తున్నారు.’ అని బెంగళూరుకు చెందిన ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ మధు పేర్కొన్నారు.  
 
అబ్బాయిల్లోనూ క్రేజ్...

 
ప్లాస్టిక్ సర్జరీల కోసం అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా ఎ గబడుతున్నారు. అమ్మాయిలు ఎక్కువగా ముక్కు, గడ్డం, పెదవులకు సర్జరీలు చేయించుకోవడానికి ఇష్టపడుతుంటే అబ్బాయిలు మాత్రం అబ్‌డామినో ప్లాస్టీ(పొట్టను తగ్గించుకోవడం)పై ఆసక్తి చూపుతున్నారు. దీనినే టమ్మీ టకింగ్ అని కూడా పిలుస్తారు. అంతేకాదు ముఖంపై ఉన్న మడతలు పోగొట్టుకోవడానికి కూడా నగరంలోని యువకులు ఎక్కువగా ప్లాస్టిక్ సర్జరీనే ఆశ్రయిస్తున్నారు. సర్జరీలలోని రకాన్ని బట్టి ఒక్కొ సర్జరీకి రూ. 25వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుందని సర్జన్‌లు చెబుతున్నారు.
 
జాగ్రత్తలు కూడా అవసరం
 
‘ఇంతకు ముందు శరీరం కాలిగాయాలైతేనే ఎక్కువగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునేవారు. అయితే ఇపుడు ముఖాకృతి కోసం, ముడతలు పోగొట్టుకోవడానికి మధ్యతరగతి వారు కూడా ఎక్కువగా ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటున్నారు. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలనుకునే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఏదో ఒక భాగానికి సర్జరీ చే యించుకున్నంత మాత్రాన మొత్తం రూపమే మారిపోతుందనుకుంటే పొరపాటు. ఒక్కొసారి సరైన నైపుణ్యం లేని డాక్టర్ల వద్ద సర్జరీ చేయించుకుంటే రక్తం గడ్డకట్టడం, బ్లీడింగ్ అవడం జరుగుతుంటాయి. అందుకే సర్జరీ చేయించుకోవాలనుకున్నపుడు నిపుణులైన సర్జన్‌లను సంప్రదించి వారి కౌన్సిలింగ్ తీసుకోవాలి. వారి సలహాలను పాటిస్తూ సర్జరీ చేయించుకుంటే అందమైన ఆకృతిని సొంతం చేసుకోవచ్చు.’                          
 - డాక్టర్ చేతన్, ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్, బెంగళూరు
 
సొట్టబుగ్గలు, పలువరుసలు కూడా...

అమ్మాయిలకు దానిమ్మ గింజల్లా కనిపించే అందమైన పలువరుస, సొట్ట బుగ్గలు ఊహించుకుంటే ఎంత బాగుందో కదా.. అందుకే ప్రస్తుతం అమ్మాయిలు వీటిపై క్రేజీగా ఉన్నారు. అదనంగా ఉన్న కణజాలాన్ని తీసేసి చీక్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ద్వారా బుగ్గలపై సొట్టలను సృష్టిస్తున్నారు సర్జన్లు. అంతేకాదు ఇంతకు ముందు పన్ను మీద పన్నుంటే ఇష్టపడేవారు కాదు. అయితే ఇప్పుడదే ప్యాషన్ అయింది. పన్నుమీద పన్నును ఇంప్లాంట్ చేయించుకోవడానికి ఆస్పత్రులకు వెళ్లే యువతుల సంఖ్య పెరుగుతోంది. అంతేకారు పెదవుల ఆకృతి సరిగా లేని అమ్మాయిలు లిప్ ఎన్‌హ్యాన్స్‌మెంట్ చేయించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
 
సర్జరీలోనూ ఎన్నో రకాలు.....

ప్లాస్టిక్ సర్జరీల్లో ప్రస్తుతం ఎక్కువగా బ్లెపారో ప్లాస్టీ( కనుబొమ్మలను తీర్చిదిద్దడం), ఓటో ప్లాస్టీ( చెవులు), చిన్ ఇంప్లాంట్(గడ్డం), చీక్ ఇంప్లాంట్ (చెంపలు), టమ్మీ టకింగ్‌లకు  డిమాండ్ ఉంది. ఈ సర్జరీల్లో సైతం ఆటోగ్రాఫ్ట్స్, అల్లో గ్రాఫ్ట్స్, క్సెనోగ్రాఫ్ట్ అనే రకాలున్నాయి.
 ఆటోగ్రాఫ్ట్స్: సర్జరీ చేయించుకునే వ్యక్తి లేదా రక్తసంబంధీకుల కణజాలాలు సరిపోకపోతే ఓ కొత్తకణజాలాన్ని టెస్ట్‌ట్యూబ్‌లో సృష్టించి దానితో సర్జరీ పూర్తిచేస్తారు.

అల్లోగ్రాఫ్ట్స్: ఒకే జాతికి చెందిన(ఆడవారికి సర్జరీ చేయాలంటే ఆడవారి నుంచి, మగవారికి సర్జరీ చేసేటపుడు మగవారి నుంచి కణజాలాన్ని తీసుకోవడం) వారి నుంచి తీసుకొని సర్జరీ చేయడం
 
క్సెనోగ్రాఫ్ట్స్: మానవ శరీరం నుంచి కాకుండా వేరే జంతువుల కణజాలాన్ని సేకరించి సర్జరీ చేయడం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement