కేకే.నగర్ : నెల రోజుల్లో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయమని పీఎంకే నేత రామదాస్ జోస్యం చెప్పారు. విల్లుపురం జిల్లా తిరుకోవిలూర్ సమీపంలోని వీరపాండి గ్రామంలో తిరుకోవిలూర్ నియోజకవర్గంలో పీఎంకే తరఫున బహిరంగ సమావేశం జరిగింది. అందులో పార్టీ నేత రామదాస్ మాట్లాడుతూ కొందరు కోట్ల రూపాయలు సంపాదించి కోర్టుకు, జైలుకు కాళ్లు అరిగేలా తిరుగుతున్నారన్నారు.
జయలలిత ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించిన కేసు బెంగళూరులో 18 సంవత్సరాలుగా నడుస్తోంది. ఈ కేసులో నాలుగేళ్లు జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. భారీ కాంట్రాక్టుల్లో కూడా దోపిడీ సంఘటనలు జరుగుతున్నాయి. జయలలిత కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో నడుస్తోంది.
మరో 30 రోజుల్లో అదే జైలుకు మళ్లీ జయలలిత వెల్లడం ఖాయం. ఎంజీఆర్‌తో నటించి అధికారం చేజిక్కించుకున్న జయలలిత బాగా నటించగలరు. ఎదుటి వారు నమ్మే విధంగా అబద్దం చెప్పగలరు అని రామదాస్ మాట్లాడారు.