వరాలిచ్చే తల్లి నల్లపోచమ్మ
♦ ముంబై, థానేల్లో ఘనంగా జరుగుతున్న పోచమ్మ తల్లి ఉత్సవాలు
♦ భక్తి శ్రద్ధలతో అమ్మవారికి నైవేద్యం సమర్పణ
♦ థానేలో 150 ఏళ్ల చ రిత్ర కలిగిన జానకీదేవి ఆలయం
సాక్షి, ముంబై : తెలుగు వారు ఎక్కువగా ఉన్న ముంబైతోపాటు థానే జిల్లాలో పోచమ్మ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగానే ఇక్కడ కూడా ప్రతిఏటా ఆషాఢ మాసంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. అయితే ఇక్కడి ప్రజలు వీలును బట్టి పండుగ జరుపుకుంటారు. ఆది, బుధవారాల్లో ఎక్కువగా పోచమ్మ పండుగ నిర్వహిస్తారు. తెలుగు సంఘాలు, మండళ్ల ఆధ్వర్యంలో సామూహిక పోచమ్మ పండుగ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఏడాది ఆగస్టు 14 వరకు ఆషాఢమాసం ఉన్నప్పటికీ ఆగస్టు 2, 9 తేదీల్లో పండుగ చేసుకుంటున్నట్లు స్థానికులు తెలిపారు.
ప్రసిద్ధి చెందిన జానకీ దేవి ఆలయం
థానే నగరంలోని శాస్త్రినగర్‌లో ఉన్న జానకీదేవి ఆలయం స్థానికంగా ప్రసిద్ధి చెందింది. జానకీదేవిని మరాఠీయులు ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. స్థానిక తెలుగువారు మాత్రం పోచమ్మగా పూజిస్తారు. ఆషాఢ మాసంలో సంప్రదాయ పద్ధతిలో పండుగ జరుపుకుంటారు. శాస్త్రినగర్‌తో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి తెలుగు ప్రజలు కూడా వచ్చి వేడుకల్లో పాల్గొంటారు. గుడి వద్ద దసరా, నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. సుమారు 150 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో రామదాస్ బాబా అనే తెలుగు వ్యక్తి అర్చకులుగా ఉండేవారు. ఆలయ అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించినట్లు స్థానికులు చెబుతారు.
బాబా తన జీవితాన్ని ఈ ఆలయానికే అంకితం చేశారని కీర్తిస్తారు. ఆయన హయాంలోనే గుడి తెలుగు వారి పోచమ్మ ఆలయంగా మారినట్టు స్థానికులు పేర్కొంటున్నారు. ఆయన 50 ఏళ్లకు పైగా ఈ ఆలయంలో పూజలు నిర్వహించారు. 1995 జనవరి 11న బాబా మరణం అనంతరం సావంత్ బాబా అనే మరాఠీ వ్యక్తి ఆలయంలో పూజారీగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం జానకీదేవి ట్రస్ట్ కూడా ఏర్పాటు చేశారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో పోచమ్మ ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. అలాగే ఎన్నో ఏళ్లు నిస్వార్థ సేవలందించిన రామదాస్ బాబా సమాధి మందిరాన్ని కూడా ఇక్కడ నిర్మించడం విశేషం.
వరాలిచ్చే.. వరాలదేవి
భివండీలో ప్రాచీనమైన వరాలదేవి మాత మందిరం ప్రసిద్ధి చెందింది. ఈ మందిరంలో కొలువైన వరాలదేవినే తెలుగు ప్రజలు పోచమ్మ తల్లిగా కొలుస్తున్నారు. తెలంగాణ ప్రాంతం నుంచి వలస వచ్చిన తెలుగు ప్రజలందరు ఆషాఢ మాసంలో పోచమ్మ పండుగను జరుపుకోవడం ప్రారంభించారు. భివండీలోకెల్లా వరాల దేవి ఆలయం చారిత్రాత్మకమైనది, అతి ప్రాచీనమైనది. ఆలయం సమీపంలో ఉన్న జలాశయాన్ని కూడా వరాలదేవి జలాశయంగా పిలుస్తారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా పోచమ్మ బోనాలు తీసుకెల్లడంతోపాటు కోళ్లు, మేకలను దేవికి బలిస్తున్నారు. ఈ సారి కూడా భివండీలోని తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున పోచమ్మ పండుగను జరుపుకుంటున్నారు. భివండీలో ఆది, శుక్రవారాలు సెలవు కావడంతో ఇక్కడి ప్రజలు అప్పుడే చేసుకుంటారు.