
మావోయిస్టుల డబ్బు మార్చడానికి వెళ్లి..
పాతనోట్లు మార్చుకోవడానికి యత్నిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 12లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
మహబూబ్‌నగర్: పాతనోట్లు మార్చుకోవడానికి యత్నిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 12లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రమా రాజేశ్వరి గురువారం విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. స్వాధీనం చేసుకున్న నగదు మావోయిస్టులకు చెందిందిగా గుర్తించినట్లు ఆమె తెలిపారు.
ఖమ్మం జిల్లా చర్లకు చెందిన ఇద్దరు కాంట్రాక్టర్లు, మక్తల్ మండలం మథన్‌గోడ్‌కు చెందిన ఓ పోస్టుమాస్టర్ సాయంతో డబ్బులు మార్చుకోవడానికి యత్నిస్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు ఆమె తెలిపారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా మావోయిస్టులే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. పోలీసుల సమాచారం ప్రకారం వారి వద్ద మొత్తం పాత డబ్బే ఉందట. ఆ కారణంగానే వారి నిత్యవసరాలు కూడా తీరని పరిస్థితి నెలకొందని, దాంతోనే వారిలో చాలామంది లొంగిపోతున్నారని కూడా ఇప్పటికే కేంద్రం కూడా తెలిపింది.