
సాక్షి, బెంగళూరు : ప్రమాదకర బ్లూవేల్ గేమ్ మరో యువకుడిని బలిగొనబోయింది. టాస్క్ పూర్తి చేయాలని బ్రిడ్జిపై నుంచి దూకబోయిన అతడిని పోలీసులు రక్షించారు. బిహార్‌కు చెందిన అజయ్ (25) బెంగళూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఎంబీఏ చదువుతూ ఐటీసీ ప్రాంతంలో నివసిస్తున్నాడు. కొద్దికాలంగా అతడు బ్లూ వేల్ గేమ్‌కు అలవాటుపడ్డాడు. ఈ క్రమంలో బ్రిడ్జిపై నుంచి కిందకు దూకాలనే టాస్క్‌ను పూర్తి చేయడానికి ఐటీసీ సమీపంలోని విండ్సన్ మ్యానర్ బ్రిడ్జిపైకి ఎక్కి దూకేందుకు సిద్ధమయ్యాడు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు ఇది గమనించి అతడిని రక్షించారు. అనంతరం బౌరింగ్ ఆస్పత్రికి తరలించారు. త్వరలో బాధితుడికి కౌన్సెలింగ్ ఇప్పిస్తామని, కొద్దిరోజులు తల్లిదండ్రులతో గడపడానికి అతడిని స్వస్థలానికి పంపిస్తామని పోలీసులు తెలిపారు.