(సాక్షి సెంట్రల్ డెస్క్)
తమిళనాట రాజకీయం నాటకీయ మలుపులతో తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తోంది. పురచ్చి తలైవి జయలలిత మరణంతోనే అన్నాడీఎంకే, తమిళనాడు సర్కారు పెనుసంక్షోభంలో కూరుకుపోతాయన్న విషయం స్పష్టమైంది. అయితే.. ‘అమ్మ’మరణానంతరం ఆమె నమ్మినబంటు పన్నీర్ సెల్వం ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టడం హడావుడిగానే అయినా సజావుగా సాగడంతో అప్పటికి సమస్య లేకపోయింది. అయితే రెండు నెలలు తిరిగేసరికే పరిస్థితులు మారిపోయాయి. ‘అమ్మ’కు నమ్మినబంటు పన్నీర్ సెల్వం.. జయలలిత నెచ్చెలి శశికళల మధ్య ఆధిపత్య పోరాటంతో ఒక్కసారిగా సంక్షోభం బద్దలైంది.
ఓ పన్నీర్ సెల్వం: రాజే బంటు.. బంటే రాజు!
రాజకీయాలను ఉత్కంఠభరిత మలుపు తిప్పిన ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం ‘అమ్మ’కు నమ్మినబంటు. 18 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన పన్నీర్.. అన్నాడీఎం కేలో ఆది నుంచీ ఉన్నారు. 1996–2001 మధ్య పెరియ కులం మునిసిపల్ చైర్మన్‌గా పనిచేశారు. కోర్టు ఉత్తర్వుల కారణంగా జయలలిత సీఎం పదవిలో కొనసాగలేని పరిస్థితుల్లో ఆమె పన్నీర్నే ఆ పదవిలో కూర్చోబెట్టేవారు. అలా 2001లో మొదటి సారి ఆరు నెలలు, 2014లో రెండోసారి ఎనిమిది నెలలు సీఎం అయ్యారు. పన్నీర్ సీఎంగా పనిచేసిన ప్రతిసారీ.. ‘అమ్మ’చేతిలో కీలుబొమ్మగానే పనిచేశారనే అభి ప్రాయం ఉంది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మళ్లీ అధికారంలోకి రాగా.. డిసెంబర్‌లో జయలలిత మరణంతో పన్నీర్ సెల్వం మూడోసారి సీఎం అయ్యా రు. అయితే.. ఈసారి రెండు నెలలకే ‘చిన్నమ్మ’శశికళ కోసం రాజీనామా చేశారు. కానీ.. రెండో రోజే తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. సీఎంగా పనిచేసిన అనుభవం ఉన్నా కానీ.. వెన్నెముక లేని నాయకుడంటూ ఇంతకాలం ఎద్దేవాకు గురైన పన్నీర్.. అకస్మాత్తుగా చిన్నమ్మపై పూర్తిస్థాయి యుద్ధం ప్రకటించారు.
శశికళ: ‘అమ్మ’కావాలనుకునే చిన్నమ్మ!
ఫంక్షన్లకు వీడియోలు చిత్రీకరించే శశికళకు.. నాడు అన్నాడీ ఎంకే ప్రచార కార్యదర్శిగా ఉన్న జయలలితతో కలిగిన పరి చయం అనతికాలంలోనే ఆమెకు అత్యంత సన్నిహితురా లిని చేసింది. ఆమె అక్కకొడుకును జయలలిత దత్తత తీసుకుని రికార్డులకెక్కే రీతిలో పెళ్లి కూడా చేశారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జయలలితతో పాటు శశికళ కూడా జైలుకెళ్లారు. అయితే.. శశికళ, ఆమె భర్త, బంధువులు తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారంటూ జయ 2011లో వారిని బహిష్కరించారు. శశికళ రాతపూర్వ కంగా క్షమాపణ చెప్పడంతో జయ మళ్లీ 3 నెలలకే ఆమెను పొయస్‌గార్డెన్ లోకి ఆహ్వానించారు. శశికళ.. జయ జీవించి ఉన్నపుడే పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో నిర్ణయాత్మక శక్తిగా.. జయ తర్వాత ‘చిన్నమ్మ’గా స్థానం పొందారు. గత ఏడాది ఎన్నికల్లో శశికళ తనకు నమ్మకస్తులైన వారికి ఎక్కువ టికెట్లు ఇప్పించుకున్నారని.. ఎన్నడూ ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయని, ప్రత్యక్ష రాజకీయాల్లో లేని ఆమెకు ఇప్పుడు కలసివచ్చే అంశం ఇదేనని భావిస్తున్నారు.
జయలలిత: అమ్మ వారసత్వం ఎవరిది?
తమిళనాట సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి.. విప్లవనాయకిగా తిరుగులేని అధినేతగా ఎదిగారు జయల లిత.. అనూహ్యంగా గత డిసెంబర్‌లో చనిపోవడంతో ఆమె రాజకీయ వారసత్వం ఎవరిదనే ప్రశ్నలు మొదలయ్యాయి. జయ మరణించిన రెండు నెలలకే.. ఆమెకు అత్యంత నమ్మకస్తులైన ఇద్దరి మధ్యనే వైరం రాజుకుంది. పన్నీర్‌సెల్వం.. చిన్నమ్మపై తిరుగుబాటు చేసే ముందు జయ సమాధి వద్ద కొద్దిసేపు మౌనదీక్ష చేశారు. అమ్మ ఆత్మ తనను నడిపిస్తోందని ప్రకటించారు. అమ్మ అభీష్టానికి పన్నీర్ ద్రోహం చేశారని శశికళ ఆరోపించారు.
నటరాజన్: చిన్నమ్మ భర్త మళ్లీ వచ్చాడు
శశికళ భర్త నటరాజన్ తన పేరును దుర్వినియోగం చేస్తున్నారన్న ఆగ్రహంతో జయలలిత 1996లోనే పొయెస్ గార్డెన్ నుంచి బహిష్కరించారు. దీంతో శశికళ కూడా ఆయనతో సంబంధాలు తెంపేసుకున్నారు. మరోవైపు.. నటరాజన్ పవర్ బ్రోకర్‌గా ఖ్యాతిని ఆర్జించడమే కాదు, ప్రముఖ వ్యక్తులతో సంబంధాలు పెంచుకున్నారు. అయితే.. జయలలిత మరణానంతరం ఆమె మృతదేహం వద్ద శశికళతో పాటు ఆమె భర్త నటరాజన్ ఇతర బంధువులు కూడా వచ్చి చేరడం విశేషం. ఆయన త్వరలోనే తెరపైకి వస్తారన్నది పరిశీలకుల అంచనా.
దీపా జయకుమార్: రంగంలోకి రక్తసంబంధం
అధికార పీఠం కోసం పన్నీర్‌సెల్వం–శశికళ మధ్య పోరు మొదలవగానే.. జయలలిత మేనకోడలు దీపా జయకు మార్ కూడా రంగంలోకి దిగారు. నిజానికి.. జయలలిత చనిపోయే వరకూ ఆమె పెద్దగా ఎవరికీ తెలియదు. జయ మరణించిన తర్వాత.. ఆస్పత్రిలో జయలలితను కలవకుండా తనను అడ్డుకున్నారని ఆరోపించి పతాక శీర్షికలకు ఎక్కారు. తాజాగా.. శశికళపై ఆరోపణలు ఎక్కుపెట్టారు. తన మేనత్త జయంతి రోజైన ఫిబ్రవరి 24న కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తానని ప్రకటించారు. దీపా జయకుమార్ తనతో చేరితే స్వాగతిస్తానని పన్నీర్ సెల్వం ప్రకటించారు.
గవర్నర్: ముంబై టు చెన్నై వయా ఢిల్లీ
తమిళనాడు పరిణామాల్లో గత నాలుగు రోజులుగా అందరి కళ్లూ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావుపైనే నిలిచాయి. గత ఆదివారం పన్నీర్‌సెల్వం రాజీనామా చేయడంతో గవర్నర్ అర్థంతరంగా ఢిల్లీ వెళ్లారు. శశికళ మంగళవారం సీఎంగా ప్రమాణం చేయడానికి ఏర్పాట్లు చేసుకోగా.. సోమవారమే చెన్నై వస్తారనుకున్న గవర్నర్.. ఢిల్లీలో ‘కేంద్ర నాయకత్వాన్ని’కలసి నేరుగా ముంబై వెళ్లిపోయారు. ఇది పలు ఊహాగానాలకు ఊతమిచ్చింది. గురువారం చెన్నైలో తొలుత పన్నీర్‌సెల్వంతో, తర్వాత శశికళతో భేటీ అయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో గవర్నర్ ఏం చేస్తారు? పన్నీర్ బలనిరూపణకు అవకాశం ఇస్తారా? శశికళను సీఎం పగ్గాలు చేపట్టడానికి ఆహ్వానిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
సుబ్రమణ్యంస్వామి: అంతుచిక్కని ఆంతర్యం
బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యంస్వామి.. జయలలిత, శశికళలపై 1996లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు పెట్టారు. ఆ కేసు కారణంగానే 2014లో జయలలిత ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు శశికళ భవితవ్యాన్ని కూడా అదే కేసు ప్రశ్నార్థకం చేస్తోంది. అయినప్పటికీ.. శశికళకు సుబ్రమణ్యంస్వామి మద్దతుగా నిలుస్తున్నారు.
డీఎంకే: వేచిచూస్తున్న విపక్షం
తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే ప్రస్తుత హైడ్రామాలో ప్రేక్షక పాత్ర పోషిస్తూ వేచిచూస్తున్నట్లు కనిపిస్తున్నా.. తన మాటలతో నాటకాన్ని రసవత్తరం చేస్తోంది. పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్.. తొలుత శశికళ సీఎం పగ్గాలు చేపట్టడాన్ని సమర్థించారు. తర్వాత పన్నీర్‌సెల్వంకు అంశాలవారీ మద్దతు ఇస్తామని ప్రకటించారు. అంతలోనే.. తమిళ ప్రజలు పన్నీర్‌కో, శశికళకో ఓటు వేయలేదన్నారు. డీఎంకేతో పన్నీర్‌సెల్వం చేతులు కలిపారని శశికళ ఆరోపించారు. ఏదేమైనా అన్నాడీఎంకేలో రాజకీయ సంక్షోభం డీఎంకేకు కలసి వస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు.
బీజేపీ: హైడ్రామా వెనుక సూత్రధారి?
తమిళనాట రాజకీయ మలుపుల వెనుక కేంద్రం పాత్ర ఉందన్న వాదనలూ బలంగానే వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో తన బలాన్ని పెంచుకోవడానికి బీజేపీ ప్రస్తుత రాజకీయ పరిస్థితిని తనకు అనుకూలంగా వాడుకుంటోందని చెప్తున్నారు. అసలు పన్నీర్‌సెల్వం ‘తిరుగుబాటు’వెనుక కారణమిదేనని అంటున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ‘సిఫారసు’మేరకు తమిళనాడు శాసనసభను సుçషుప్తచేతనావస్థలో ఉంచటమో, రద్దు చేయడమో చేసి.. రాష్ట్రపతి పాలన విధిస్తారా? అన్న అంశాలపై ఇప్పుడు వాడీవేడిగా చర్చ జరుగుతోంది.
పాత్రధారులెవరు? సూత్రధారులెవరు?
Published Fri, Feb 10 2017 3:25 AM | Last Updated on Tue, Sep 5 2017 3:18 AM
Advertisement
Advertisement