చెరువును తలపించిన రోడ్డు
Published Wed, Aug 28 2013 1:27 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
ప్రజల్లో సామాజిక స్పృహ లోపించడం, సమర్థ నీటి వినియోగంపై అవగాహన లేకపోవడం, ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయ లోపం వల్ల డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని నిపుణులు చెబుతున్నారు. మురుగుకాల్వలను బాగుపరచడానికి మరిన్ని పయత్నాలు చేయడంతోపాటు కొత్త వాటిని నిర్మించడమే ఈ సమస్యకు పరిష్కారమని వారు అంటున్నారు.
న్యూఢిల్లీ: కేవలం రెండు గంటలపాటు ఏకధాటిగా వర్షం కురిస్తే చాలు.. ఢిల్లీ నగరం దాదాపు స్తంభించిపోతోంది. రోడ్లపైకి నీళ్లు రావడం, ట్రాఫిక్‌జామ్‌లు.. ఫలితంగా వాహన చోదకులకు నరకం. వర్షాకాలంలో ఢిల్లీవ్యాప్తంగా ఇలాంటి దృశ్యాలు సర్వసాధారణంగా మారాయి. ఈ పరిస్థితికి అస్తవ్యస్త డ్రైనేజీ వ్యవస్థే కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇందిరాగాంధీ విమానాశ్రయంలోని మూడో టెర్మినల్‌లోకి కూడా భారీగా నీరు వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి ఢిల్లీ డ్రైనేజీలు బాగుపడేదెప్పుడు ? మున్సిపల్ కార్పొరేషన్లు ఈ విషయంలో ఏం చేస్తున్నాయి ? ఈ ప్రశ్నలకు సమాధానం లభించడం చాలా కష్టం. నగర డ్రైనేజీ వ్యవస్థను మొత్తంగా ఒకే కార్పొరేషన్‌కు అప్పగిస్తే సత్ఫలితాలు ఉంటాయని నిర్మాణరంగ నిపుణులు చెబుతున్నారు.
ఈ ప్రతిపాదన ఆచరణ సాధ్యమేనా అన్న ప్రశ్నకు జామియా మిలియా యూనివర్సిటీ ప్రొఫెసర్, హైడ్రాలజిస్టు కూడా అయిన డాక్టర్ గౌహర్ మెహమూద్ ‘అవున’నే సమాధానం ఇచ్చారు. డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారడానికి చాలా కారణాలు ఉన్నాయన్నారు. ‘ప్రజల్లో సామాజిక స్పృహ లోపిస్తోంది. ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను నేరుగా డ్రైనేజీల్లోనే పారబోస్తున్నారు. ఫలితంగా వర్షాల సమయంలో కాలువలు ఉప్పొంగుతున్నాయి. ఢిల్లీకి తగిన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ లేదు. అవినీతి వల్ల ఈ సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. డ్రైనేజీల నిర్వహణకు కేటాయిస్తున్న నిధుల వినియోగం సక్రమంగా లేదు. మున్సిపల్ కార్పొరేషన్ల మధ్య సమన్వయం ఉండడం లేదు. కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లోని పరిశోధనలు గ్రంథాలయాలకే పరిమితమవుతున్నాయి. వీటి సిఫార్సులు కూడా అటకపైనే ఉంటున్నాయి’ అని విశదీకరించారు. వీటన్నింటికితోడు వర్షపు నీటి సంరక్షణకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్ల కూడా డ్రైనేజీలు పాడవుతున్నాయి. డ్రైనేజీల నిర్మాణం కూడా సక్రమంగా ఉండడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ విషయమై తగిన సిఫార్సుల కోసం విద్యావంతులు, ఇంజనీర్లు, డిజైనర్లతో కమిటీలు వేయాలని గౌహర్ అభిప్రాయపడ్డారు.
1981లో ఖరారైన మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగా నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థ ప్రస్తుతం పరిస్థితులకు ఏమాత్రం సరిపోవడం లేదు. పట్టణీకరణ, జనాభా విపరీతంగా పెరగడమే దీనికి కారణం. ప్రముఖ వాస్తుశిల్పి భారత్‌లాల్ దీనికి ఒక పరి ష్కారం చూపిస్తున్నారు. ఆయన మాటల్లో చెప్పాలంటే.. ప్రతి వార్డుకు ఒక డ్రైనేజీ వ్యవస్థ, చిత్రపటం ఉండాలి. స్థానిక నిర్మాణాలు, డ్రైనేజీలను అందులో ప్రదర్శించాలి. ఫలితంగా సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్ వాస్తవ పరిస్థితులు, సాంకేతిక ఇబ్బందులను మదింపు చేసి తదనుగుణంగా డ్రైనేజీలకు మరమ్మతులు నిర్వహించగలుగుతుం ది. డ్రైనేజీ వ్యవస్థ నిర్వహణకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ఎంతైనా అవసరమని మరో నిర్మాణరంగ నిపుణుడు కుశాల్ లజ్వానీ అభిప్రాయపడ్డారు. ‘నీటి సరఫరా నిర్వహణ, వాటి విసర్జన అన్నింటికంటే ముఖ్యమైన విషయం.
నీటిని ఎలా వినియోగించుకోవాలి.. ఎలా బయటికి పంపించాలనే విషయంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. డ్రైనేజీ వ్యవస్థ బాగోగులను కూడడానికి ప్రత్యేక విభాగం ఉండా లి. ఇది సంబంధిత కార్పొరేషన్లతో కలిసి డ్రైనేజీ వ్యవస్థను బాగుపర్చడానికి కృషి చేయగలుగుతుంది’ అని ఆయన వివరించారు. నిపుణులందరి ఏకాభిప్రాయం ఏమిటంటే మురుగుకాల్వల బాగుపరచడానికి మరిన్ని ప్రయత్నాలు జరగాల్సి ఉంది. అంటే ఇప్పుడున్న కాల్వలను బాగుచేయడంతోపాటు కొత్త వాటిని నిర్మించాలి. లేకుంటే పరిస్థితిలో పెద్ద మార్పేమీ ఉండదని వారు చెబుతున్నారు.
Advertisement