అశ్లీల ఎస్‌ఎమ్మెస్‌లు పంపిస్తే జైలుకే
రాష్ట్ర ప్రతిపాదనకు కేంద్రం ఓకే!
సాక్షి,బెంగళూరు :అశ్లీల ఎస్‌ఎమ్మెస్‌లు, ఎంఎంఎస్‌లు పంపిన వారు ఇకపై జైలుకు వెళ్లడం ఖచ్చితం. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన చట్టసవరణకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించనట్లు సమాచారం. అశ్లీల చిత్రాలను, సమాచారాన్ని మహిళలకు, చిన్నారులతో పాటు బలవంతంగా ఇతరులకు చూపించడం చట్య రీత్యా నేరం. ఇప్పటి వరకూ ముద్రణా (కాగితం) రూపంలో ఉన్న అశ్లీల చిత్రాలు, సమాచారంతో పాటు కొంత వరకూ ఎలక్ట్రానిక్ రూపంలోని అశ్లీలతకు ఈ చట్టం వర్తిస్తుంది. అయితే చట్టంలోని కొన్ని లొసుగులను వినియోగించుకుని దుండగులు శిక్ష నుంచి తప్పించుకుంటున్నారు.
సమస్య పరిష్కారం కోసం కఠిన, నూతన చట్టాన్ని ప్రభుత్వం రూపొందించింది. నూతన విధానం ప్రకారం ఒక నిమిషం పాటు అశ్లీల చిత్రాలు, సమాచారాన్ని ఎస్‌ఎంఎస్, మెయిల్‌తో పాటు ఇతర ఏ ఎలక్ట్రానిక్ రూపంలో పంపించినా వారికి మూడేళ్ల జైలు శిక్షతోపాటు రూ. లక్ష జరిమాన విధిస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం సమ్మతించినట్లు తెలుస్తోంది. త్వరలో అధికారిక ప్రకటన రానుంది.