
‘చిన్న నోట్లు కావాలని ఆర్బీఐని అడిగాం’
హైదరాబాద్: ప్రణాళిక ప్రకారం పాలన కొనసాగిస్తామని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర అన్నారు. ఉద్యోగులు, ప్రజల నుంచి సహకారం ఆశిస్తున్నట్టు ‘సాక్షి’తో చెప్పారు. పాత పెద్ద నోట్ల రద్దుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట వాస్తమేనని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయక తప్పదని అన్నారు. ప్రజల రోజువారి ఇబ్బందులను ఎప్పటికప్పుడు కేంద్రం, ఆర్బీఐ నివేదిస్తున్నామని తెలిపారు.
చిన్న నోట్లు కావాలని ఈరోజు కూడా ఆర్బీఐని కోరినట్టు వెల్లడించారు. నోట్లు రాగానే గ్రామీణ ప్రాంతాలకు పంపిస్తామన్నారు. రోజువారీ కూలీలు, చేతి వృత్తుల వారు డబ్బుల్లేకుండా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. వ్యవసాయ మార్కెట్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని ప్రదీప్ చంద్ర హామీయిచ్చారు.