కర్నూలులో వైఎస్ జగన్ యువభేరి
కర్నూలు(ఓల్డ్‌సిటీ): ప్రత్యేక హోదా సాధనలో భాగంగా ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం యువభేరి కార్యక్రమం నిర్వహించనున్నారు. కర్నూలు శివారు గుత్తి జాతీయ రహదారిలోని వీజేఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో ఉదయం 10 గంటలకు వైఎస్ జగన్ ప్రత్యేక హోదాపై యువతలో చైతన్యం తీసుకురావడంతో పాటు వారితో ముఖాముఖి నిర్వహిస్తారు. 10వేల మంది సామర్థ్యం కలిగిన కన్వెన్షన్ హాలులో ఇందుకోసం సుమారు ప్రత్యేక వేదిక ఇప్పటికే రూపుదిద్దుకుంది.
సోమవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డితో కలిసి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ సభాస్థలి, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా గౌరు మాట్లాడుతూ యువభేరిలో పాల్గొనేందుకు యువత పెద్ద ఎత్తున ఆసక్తి కనబరుస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర భవిష్యత్తు ముడిపడి ఉన్నందున విద్యార్థులు, యువకులతో పాటు మేధావులు, ప్రజా సంఘాల నాయకులు పార్టీలకు అతీతంగా పాల్గొనాలని కోరారు. ఏర్పాట్ల పరిశీలనలో మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్‌రెడ్డి, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, కార్యదర్శి పోచం శీలారెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తోట వెంకటకృష్ణారెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాం బాబు, ఆ విభాగం నగర అధ్యక్షుడు గోపినాథ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.