హోదాపై మోసం.. ప్రత్యేక ప్యాకేజీ అబద్ధం | Ananthapuram Yuvabheri for AP special status | Sakshi
Sakshi News home page

హోదా ఉండుంటే ఈ పాటికే ఉద్యోగాలొచ్చేవి : వైఎస్‌ జగన్‌

Published Tue, Oct 10 2017 1:33 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

Ananthapuram Yuvabheri for AP special status - Sakshi

సాక్షి, అనంతపురం : పార్లమెంట్‌ సాక్షిగా హామీయిచ్చినట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే.. ఈ పాటికే చాలా మార్పులను మనం చూసి ఉండేవాళ్లం. లక్షల ఉద్యోగాలు వచ్చి ఉండేవి. ఈ మూడున్నరేళ్లలో ఎన్నో పరిశ్రమలు, హోటళ్లు, ఆస్పత్రులు కట్టేవాళ్లు, చదువుకునే యువతకు భరోసా వచ్చేది. ఉద్యోగం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా పోయేది. కానీ.. అధికారంలో ఉన్నవారు మోసం చేయడంతో ఆ పరిస్థితిని మనం చూడలేకపోతున్నాం. విభజనతో జరిగిన నష్టాన్ని ప్రత్యేక హోదా మాత్రమే పూడ్చగలదు. అందుకే మన హక్కును సాధించుకోవడానికి నిరంతరాయంగా, ఐక్యంగా పోరాడుదాం..’’ అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు.

సోమవారం అనంతపురం పట్టణంలోని ఎంవైఆర్‌ గార్డెన్స్‌లో నిర్వహించిన యువభేరి కార్యక్రమంలో జననేత జగన్‌ పాల్గొని యువతను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ఏం మాట్లాడారంటే..
‘‘హోదాకానీ, ప్యాకేజీకానీ లేదన్నది నిజం :  ప్రత్యేక హోదా రాష్ట్రాల్లోని 6.2 శాతం జనాభాకు 1.58 లక్షల కోట్లిచ్చారు, మరి 4కోట్ల ఆంధ్రులకు ఏమిచ్చారు? ప్రత్యేక హోదా ఎంత అవసరమో ప్రజలందరికీ అర్థమైనా, ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాత్రం అర్థం కావడంలేదు. కేవలం తన స్వార్థం కోసం ఆయన హోదాని పణంగా పెట్టారు. మాట్లాడితే, 14 ఆర్థిక సంఘం ఇవ్వడం లేదని, హోదాను మించిన ప్యాకేజీ తీసుకొచ్చానని బొంకుతున్నారు. ఈ రెండూ అబద్ధాలే. దేశంలో 11 రాష్ట్రాలకు హోదా ఉన్నమాట వాస్తం. మనకు మాత్రం హోదాగానీ, ప్యాకేజీకానీ లేదన్నదీ నిజం. రాష్ట్రాలకు వివిధ రూపాల్లో కేంద్రం ఎన్ని నిధులిచ్చాయనే దానిపై 2017, ఏప్రిల్‌ 11న ఆర్థిక మంత్రిత్వ శాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాల జనాభా 7.51 కోట్లు, అంటే దేశ జనాభాలో 6.2 శాతం. వీళ్లకు కేంద్రం 2016-17లో 1.58 లక్షల కోట్లు ఇచ్చారు. అన్ని రాష్ట్రాలకు కలిపి ఇచ్చిన మొత్తం(9.7 లక్షల కోట్లులో) ప్రత్యేక హోదా రాష్ట్రాలకే 14.06 శాతం నిధులు వెళ్లాయి. మరి దేశజనాభాలో 4.08 శాతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు కేవలం 44 వేల కోట్లు మాత్రమే వచ్చాయి. అదే హోదా ఉండి ఉంటే ఇంకా మెండుగా నిధులు వచ్చేవి.

ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదు : ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని అంటున్నారు. మరి అలాంటప్పుడు రాష్ట్రాలకు నిధులిచ్చే విషయంలో తేడాలు ఎందుకు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నా. ఇటీవల జీఎస్టీని తెచ్చారు. అందులోనూ ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు భారీగా మినహాయింపులు ఇచ్చారు. ప్రధాని సౌభాగ్య యోజన(కరెంట్‌ లేని ఇళ్లకు కనెక్షన్‌) పథకంలోనూ హోదా ఉన్న రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇదంతా వాస్తవమైతే, చంద్రబాబు తన దగ్గరున్న మీడియాతో హోదా వల్ల ప్రయోజనం లేదంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు. ఇది దారుణం కాదా?

ఇది 10వ యువభేరి : ఇవాళ అనంతపురంలో జరుగుతున్నది 10వ యువభేరి. గుంటూరులో 9వ యువభేరి తర్వాత విద్యార్థులకు పరీక్షలు, సెలవులు, తర్వాతి విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ జరిగింది. విరామం తర్వాత తిరిగి పోరాటాన్ని పునఃప్రారంభించాం. గత మూడున్నర సంవత్సరాలుగా అందరం కలిసికట్టుగా పోరాడం. వైఎస్సార్‌సీపీ పార్టీ పరంగానూ గడిచిన కాలంలో ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉద్యమాలు చేశాం.  రెండు నిరాహార దీక్షలు జరిగాయి. మంగళగిరిలో రెండు రోజులు, గుంటూరులో 7 రోజులు దీక్ష చేశాం. చంద్రబాబు పోలీసుల్ని పంపి గుంటూరు దీక్షను భగ్నం చేశారు. కనీసం ఆయనైనా మోదీగారిని ప్రత్యేక హోదా గురించి అడిగారా అంటే అదీ లేదు. ఇదే డిమాండ్‌ కోసం వైఎస్సార్‌సీపీ రెండు సార్లు రాష్ట్ర బంద్‌కు పిలుపిచ్చింది. ఆ బంద్‌లను విఫలం చేయడానికి చంద్రబాబు గారు బస్సులు తిప్పించారు. హోదా హామీ నెరవేర్చాలని ఢిల్లీ వెళ్లి ప్రధానిని మూడు,నాలుగు సార్లు కలిసి, వినతిపత్రాలిచ్చాం. చట్టసభలైన పార్లమెంట్‌, అసెంబ్లీల్లోనూ ప్రత్యేక హోదా అంశంపై ఎంపీలు, ఎమ్మెల్యేలు గట్టిగా పోరాటం చేశారు. ప్రతి బహిరంగ సభల్లో అంశాన్ని ప్రస్తావించాం. పార్టీ ప్లీనరీలో హోదాపై తీర్మానం చేయించాం. ఇవన్నీ చేసినా పాలకులు హోదా ఇచ్చారా?..

అధికారంలో ఉన్నవారి చెవులు మూసుకుపోయిన పరిస్థితిలోనూ మనం మాత్రం పోరాటాలు కొనసాగిస్తున్నాం. హైదరాబాద్‌ నగరాన్ని ఆధునికంగా మార్చుకోవడానికి 60 ఏళ్లు పట్టింది. విభజన తర్వాత అలాంటి నగరాన్ని మనం కోల్పోయాం. అందుకే పార్లమెంట్‌ సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని ఐదుకోట్ల మంది ఆంధ్రులకు హామీ ఇచ్చారు.  హోదా పేరుతో ఓట్లు పొంది, అధికారంలోకి వచ్చినవాళ్లు కొద్ది రోజుల్లోనే ప్లేటు ఫిరాయించారు. ఈ సందర్భంగా తిరుపతి సభలో నరేంద్ర మోదీ, చంద్రబాబులు చేసిన ప్రసంగాలను మనం ఒకసారి గుర్తుచేసుకుందాం. (ఆ తర్వాత చంద్రబాబు ‘బహునాలుక’  ప్రకటనలను విద్యార్థులకు చూపెట్టారు)

10 కాదు, 15 ఏళ్లు కావాలన్న మాటలు ప్రజలకు గుర్తే :  ప్రత్యేక హోదా ఉంటేనే రాష్ట్రానికి పరిశ్రమలు, ఆస్పత్రులు, స్కూళ్లు వస్తాయి. అవి వస్తేనే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. హోదా ఉంటే పరిశ్రమలకు పన్ను మినహాయింపులు ఉంటాయి. కొత్త పరిశ్రమలు పెట్టగోరేవారు చంద్రబాబు సుందర ముఖారవిందాన్ని చూసి రారు.. పన్ను మినహాయింపులు ఉంటేనే ముందుకొస్తారు. ఇది నిజం కాబట్టే విభజన సమయంలో అధికార, ప్రతిపక్షాలు హోదాపై గట్టిగా మాట్లాడాయి. అంతటితో ఆగకుండా హోదా ఐదేళ్లు, 10 ఏళ్లు కాదు, 15 ఏళ్లు కావాలని అన్నారు. కానీ తీరా ఎన్నికలు అయిపోయి, అధికారంలోకి వచ్చాక ఏమంటున్నారు? ప్రత్యేకహోదా సంజీవనా? అని ప్రశ్నిస్తున్నారు. పార్లమెంట్‌ సాక్షిగా పెద్దలు ఇచ్చిన హామీ అమలు కాకుంటే ప్రజాస్వామ్యం పరిస్థితేంటి?

అనంతపురం గోస కనబడదా? : అనంతపురం లాంటి జిల్లాకు ప్రత్యేక హోదా చాలా అవసరం. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ తర్వాత దేశంలో అతితక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లా అనంతపురమే కావచ్చు. జిల్లాలోని అధికప్రాంతం ఎడారిగా మారుతుందేమోనని మనం భయపడుతున్నాం. ఇప్పటికీ ఏపీలో అతిపెద్ద జిల్లా అనంతపురమే. అత్యధికంగా వలసలు పోతున్న జిల్లా కూడా ఇదే. పంటలు పండక, పనులు లేక, అప్పులపాలై  ఏటా కనీసం  4,5 లక్షల మంది వలసలు పోతున్నారు. చివరికి రైతుల ఆత్మహత్యలు సైతం ఎక్కువగా ఉన్న జిల్లా కూడా అనంతపురమే కావడం శోచనీయం.

2014లో అనంతపురం జిల్లా సాక్షిగా, అటుపై అసెంబ్లీలోనూ చంద్రబాబు చెప్పిందేంటి? అనంతపురంలో సెంట్రల్‌ యూనివర్సిటీ, ఎయిమ్స్‌కు అనుబంధ కేంద్రం, నూతన పారిశ్రామిక నగరం, స్మార్ట్‌ సిటీ, బెంగళూరు-చెన్నై కారిడార్‌, టెక్స్‌టైల్‌ పార్క్‌, ఫుడ్‌పార్క్‌, ఎలక్ట్రానిక్‌ హార్డ్‌వేర్‌ క్టస్లర్‌, బీహెచ్‌ఈఎల్‌, పుట్టపర్తిని ఆథ్యాత్మిక నగరంగా మార్చి, విమాన నిర్వహణ కేంద్రం స్థాపన, స్టీల్‌ ప్లాంట్‌, హంద్రీ-నీవా ప్రాజెక్టు పూర్తి.. ఒక్కటేమిటి? నోటికొచ్చిన హామీలన్నీ చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కటీ చెయ్యలేదు.

నంబర్‌ 2 నుంచి పాదయాత్ర : నవంబర్‌ 2 నుంచి పాదయాత్ర మొదలవుతుంది. ఇడుపులపాయ నుంచి చిత్తూరు మీదుగా ఇచ్ఛాపురం దాకా సాగుతుంది. 6 నెలల్లో మూడువేల కిలోమీటర్లు జరిగే పాదయాత్ర జరుగుతుంది. యువభేరి కార్యక్రమాలను ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే నియోజకవర్గ కోఆర్డినేటర్లు.. కాలేజీలకు వెళ్లి, విద్యార్థులను కలుస్తారు. ప్రజల మద్దతును కూడగడుతూ, అవసరమైనప్పుడు చివరి అస్త్రంగా ఎంపీలతో రాజీనామా చేయిస్తాం. పోరుబాటలో భాగంగా రాబోయే రోజుల్లో ఇవన్నీ జరుగుతాయి. పిల్లలకు పరీక్షలనే ఉద్దేశంతో హోదా ఉద్యమానికి విరామం​ ఇచ్చాం. ఈ ఆరు నెలల కాలంలో ప్రత్యేక హోదా గురించి ఎవరైనా మాట్లాడారా? జగన్‌ మాట్లాడితేనే ప్రత్యేకహోదా అనే పరిస్థితి మారాలి. పాలకులపై ఒత్తిడి పెరగాలి. ఆమేరకు మనం పోరాటాలు చేయాలి. అందుకోసం మీ అందరి తోడ్పాటు, సహకారం కావాలి. అప్పుడే మనం హోదాను సాధించుకుంటాం. ప్రత్యేక హోదా అంటే ఉద్యోగాల కోసం మన పిల్లలు ఎక్కడికో పోవాల్సిన పనిలేదు. చదువుకున్న మన పిల్లలకు మన జిల్లాలోనే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి అని గుర్తుంచుకోండి’’ అని జగన్‌ ప్రసంగాన్ని ముగించారు. అనంతరం విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement