రాష్ట్రానికి ఢిల్లీ పెద్దలు
సాక్షి, చెన్నై : ఎన్నికల వాతావరణం వేడెక్కడంతో ఓట్ల వేటకు ఢిల్లీ పెద్దలు రాష్ట్రానికి పరుగులు తీస్తున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ, ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీల పర్యటనలు ఖరారు అయ్యాయి. ఇక కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా పర్యటనకు సిద్ధం అయ్యారు. అలాగే, బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రులు రాష్ర్టంలో ప్రచారంలో దూసుకెళుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది.
మరి కొన్ని గంటల్లో ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించబోతున్నారు. వాతావరణం వేడెక్కడంతో ఓటర్ల ప్రసన్నంలో అభ్యర్థులు ఉరకలు పరుగులు తీస్తున్నారు. రాష్ట్రానికి చెందిన ఆయా పార్టీ అధినాయకులు ప్రచారంలో దూసుకెళుతుంటే, జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీల ఢిల్లీ పెద్దలు రాష్ర్టం వైపుగా దృష్టి మరల్చి ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల ఎనిమిదో తేదీన కన్యాకుమారి ప్రచార బహిరంగ సభతో పాటుగా మదురై, కోయంబత్తూరులలో పర్యటించేందుకు నిర్ణయించి ఉన్నారు. ఇక, తమ అభ్యర్థులు, డీఎంకే అభ్యర్థులకు మద్దతుగా కరుణానిధితో కలసి ఒకే వేదిక మీద దర్శనం ఇచ్చేందుకు ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ సిద్ధమయ్యారు. ఈనెల ఐదో తేదీన ఐల్యాండ్ గ్రౌండ్‌లో జరగనున్న బహిరంగ సభకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. అదే సమయంలో తాను సైతం అంటూ ప్రచారానికి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సిద్ధం అయ్యారు.
ఈనెల ఏడో తేదీన చెన్నై, తిరువణ్ణామలై, కోయంబత్తూరులలో జరిగే బహిరంగ సభల్లో ప్రసంగించబోతున్నారు. అలాగే, ఈనెల 13న దక్షిణ తమిళనాడులో పర్యటించేందుకు నిర్ణయించారు. అయితే,ఆయన పర్యటన సాగే ప్రాంతాలను ఎంపిక చేసే పనిలో కాంగ్రెస్ వర్గాలు ఉన్నాయి. అదే విధంగా రాహుల్, డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ ఒకే వేదిక మీద నుంచి ఓటర్లకు పిలుపు నిచ్చేందుకు తగ్గ కసరత్తులకు కాంగ్రెస్ వర్గాలు చర్యలు చేపట్టారు. అయితే, ఇది సాధ్యం అయ్యేనా అన్నది వేచి చూడాల్సిందే. ఇక, బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో కేంద్ర మంత్రులు ఓట్ల వేటలో పరుగులు తీస్తున్నారు. ఇప్పటికే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రచారంతో ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు.
ఆదివారం కరూర్, తిరుచ్చిల్లో ఆయన పర్యటన సాగింది. డీఎంకే, అన్నాడీఎంకే, కాంగ్రెస్‌లను టార్గెట్ చేసి ఆయన ప్రసంగం సాగుతున్నది. అలాగే, మరో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రచార బాటకు శ్రీకారం చుట్టారు. పుదుచ్చేరిలో జరిగిన ప్రచార సభలో అక్కడి కాంగ్రెస్, ఎన్‌ఆర్ కాంగ్రెస్‌లను టార్గెట్ చేసి తీవ్రంగా విరుచుకు పడ్డారు. రాష్ర్ట నేతలు ఉరకలు, పరుగులు తీస్తున్న సమయంలో, ఢిల్లీ పెద్దలు మోదీ, సోనియా, రాహుల్ సైతం మొహరించేందుకు సిద్ధం కావడంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రచార సమరం మరింతగా రాజుకుంది.