
పార్టీ కార్యాలయంలో వ్యభిచారం
14 మంది అరెస్ట్
టీనగర్: తిరుపూరులోని ఓ పార్టీ కార్యాలయంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఆరుగురు మహిళలు సహా 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 15 ఏళ్ల బాలికను రక్షించి పోలీసు సంరక్షణాలయంలో చేర్చారు. తిరుపూరు మంగళం రోడ్డులో ఓ రాజకీయ పార్టీ కార్యాలయం ఉంది. ఈ పార్టీ అసంఘటిత కార్మిక సంక్షేమ సంఘం నిర్వాహకునిగా సెంథిల్‌కుమార్ (30) పనిచేస్తున్నారు. ఈ పార్టీ కార్యాలయంలో వ్యభిచారం జరుగుతున్నట్లు తిరుపూరు వెస్ట్ మహిళా పోలీసులకు సమాచారం అందింది.
బద్రున్నిసా నేతృత్వంలో పోలీసులు రహస్యంగా నిఘా పెట్టారు. కార్యాలయం ముందు భాగంలో పార్టీ సైన్‌బోర్డు ఏర్పాటుచేసి లోపలి గదిలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు నిర్ధారించారు. మొదటి అంతస్తులో మహిళలు ఉన్నట్లు కనుగొని అక్కడికి ఆకస్మికంగా ప్రవేశించిన పోలీసులు అక్కడున్నవారిని చుట్టుముట్టారు. దేవి, జ్యోతిమణి, మీరా, మణిమారన్, మరో ముగ్గురు యువతులు వ్యభిచారం చేస్తున్నట్లు తెలిసింది. అంతేకాకుండా 15 ఏళ్ల వయసు బాలికను వ్యభిచారంలోకి దించినట్లు గుర్తించారు.
ఈ బాలిక వద్ద విచారణ జరపగా తన సొంతవూరు మంగళం అని తల్లి మృతిచెందినట్లు తెలిపింది. తండ్రి ఇక్కడున్న దేవి అనే మహిళను రెండో వివాహం చేసుకున్నట్లు పేర్కొంది. తాను ఇంటి పనులు చేస్తూ వచ్చానని, తక్కువ వేతనం లభిస్తుండడంతో వ్యభిచారం ద్వారా ఎక్కువ సంపాదించవచ్చని పినతల్లి చెప్పడంతో ఈ వృత్తిలోకి దిగినట్లు పేర్కొంది. దీంతో పోలీసులు వ్యభిచార ముఠాకు చెందిన ఆరుగురు మహిళలు సహా 14 మందిని అరెస్టు చేశారు. బాలికను రక్షించి పోలీసు సంరక్షణాలయంలో ఉంచారు.