- ఆ అధికారం నాకుంది
- నేను ముఖ్యమంత్రిగా, పార్టీ చీఫ్‌గా పని చేశా
- నేను స్థానికేతరుడిని కాను
- రాష్ర్టంలో లోపించిన శాంతిభద్రతలు
- ఊపందుకుంటున్న మావోయిస్టుల కార్యకలాపాలు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచి పోటీ చేసినా బీజేపీ అభ్యర్థిగా తాను రంగంలో ఉంటానని శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు సదానంద గౌడ తెలిపారు. నగరంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బెంగళూరు ఉత్తర నియోజక వర్గం నుంచి తాను పోటీ చేయాలనుకోవడాన్ని మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్. అశోక్ వ్యతిరేకిస్తున్నారని వస్తున్న వార్తలపై స్పందిస్తూ, తాను ముఖ్యమంత్రిగా, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పని చేశానని గుర్తు చేశారు.
కనుక ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని, తాను స్థానికేతరుడిని కానని అన్నారు. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయాన్ని పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. పార్టీ జాతీయ నాయకులు సుష్మా స్వరాజ్, వెంకయ్య నాయుడు, నటి హేమమాలిని ఇక్కడి నుంచి పోటీ చేసినప్పుడు చప్పట్లు కొట్టిన వారు, తన విషయంలో ఎందుకు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
కాగా రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని, హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, దొంగతనాలు శ్రుతి మించాయని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 1,500కు పైగా హత్యలు జరిగాయని పోలీసు గణాంకాలే చెబుతున్నాయని అన్నారు. పారిశ్రామికవేత్తలు దాడులు జరుగుతున్నాయని, మావోయిస్టుల కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయని ఆరోపించారు.