రాహుల్‌కు రాచమర్యాదలా!
* కాంగ్రెస్ అధికార దుర్వినియోగంపై విపక్షాల మండిపాటు
* ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎలా ఉపయోగించుకుంటారు ?
* అధికార పదవిలో రాహుల్ లేరు
* ఆయనకు ప్రభుత్వం సహకరించడం ఏమిటి?
* సంబంధిత అధికారులపై చర్యలు చేపట్టాలని బీజేపీ డిమాండ్
* ఎదురు దాడికి దిగిన కాంగ్రెస్
బెంగళూరు : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గత వారం నగరంలో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు అధికార దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలపై శుక్రవారం శాసన సభలో పాలక, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కొంత సేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. జీరో అవర్‌లో ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్ ఈ అంశాన్ని లేవనెత్తుతూ, ఈ కార్యక్రమానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగించుకున్నారని ఆరోపించారు.
విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి రజనీశ్ గోయల్ అక్కడే ఉన్నారని, ఆ కార్యక్రమం పర్యవేక్షకుడిగా వ్యవహరించారని తెలిపారు. జాతీయ నాలెడ్జ్ కమిషన్ అధ్యక్షుడు శ్యామ్ పిట్రోడా ఈ కార్యక్రమానికి విద్యార్థులను తరలించాల్సిందిగా సూచించారని చెప్పారు. రాహుల్ గాంధీ ఎలాంటి అధికార పదవిలో లేనందున, ప్రభుత్వం ఆయన కార్యక్రమాలకు సహకరించడం సరికాదని విమర్శించారు. ఈ మొత్తం వ్యవహారం క్రమశిక్షణ ఉల్లంఘన కిందికి వస్తుందని, సంబంధిత అధికారులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఈ దశలో పాలక పక్ష సభ్యులు ఎదురు దాడికి దిగడంతో సభలో గందరగోళం నెలకొంది. అటవీ శాఖ మంత్రి రమానాథ్ రై గట్టిగా మాట్లాడుతూ పాలనా యంత్రాంగాన్ని ఎవరు...ఏ విధంగా దుర్వినియోగ పరిచారనే విషయమై దర్యాప్తు జరగాలని సూచించారు. బీజేపీ హయాంలో ప్రభుత్వ సదుపాయాలను దుర్వినియోగం చేసిన విషయం జగమెరిగిన సత్యమని తూర్పారబట్టారు. దీనిపై బీజేపీ సభ్యుడు సీటీ. రవి స్పందిస్తూ మంత్రి సూచన స్వాగతార్హమంటూ, న్యాయ విచారణకు సిద్ధమా అంటూ సవాలు విసిరారు. పరిస్థితి శ్రుతి మించడంతో స్పీకర్ కాగోడు తిమ్మప్ప జోక్యం చేసుకుని రవికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.
మంత్రి తనదైన శైలిలో ఆవేశంతో మాట్లాడుతూనే ఉండడంతో స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రిగా ఉంటూ అలా మాట్లాడడం తగదని హితవు పలికారు. అనంతరం మంత్రులు హెచ్‌సీ. మహదేవప్ప, కృష్ణ బైరేగౌడలు మాట్లాడుతూ విద్యార్థులతో రాహుల్ ముఖాముఖి... తమ పార్టీ కార్యక్రమం కాదని, ప్రభుత్వం నుంచి ఒక పైసా కూడా ఖర్చు కాలేదని వివరణ ఇచ్చారు.
ఈ సందర్భంలో హోమ్ మంత్రి కేజే. జార్జ్ జోక్యం చేసుకుని బీజేపీ హయాంలో ఏబీవీపీ సమావేశం సందర్భంగా మహారాణి కళాశాల గదులను టాయ్‌లెట్లుగా మార్చిన విషయం తమకింకా గుర్తుందని ఎద్దేవా చేశారు. ఈ దశలో మళ్లీ గందరగోళం నెలకొనడంతో స్పీకర్ జోక్యం చేసుకుని, ఈ విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని ప్రకటించడంతో బీజేపీ సభ్యులు శాంతించారు.