- భద్రత కోసం నిపుణుల కమిటీ
- కేంద్ర మంత్రి సదానందగౌడ
సాక్షి, బెంగళూరు : ప్రయాణికుల భద్రత మెరుగుపరచడంతో పాటు రైళ్లలో ఆధునిక సదుపాయాల కల్పన కోసం నిపుణుల కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి సదాన ందగౌడ వెల్లడించారు. ఈ కమిటీకి సేవలు అందించాల్సిందిగా ప్రఖ్యాత ఇంజినీర్, మెట్రో మ్యాన్‌గా పేరుగాంచిన శ్రీధరన్‌ను కోరనున్నామన్నారు. ఇందు కోసం తానే స్వయంగా ఆయన్ను కలవనున్నట్లు సదానందగౌడ తెలిపారు.
బెంగళూరులో ఆదివారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైల్వే ప్రయాణికులకు సేఫ్టీ, సెక్యూరిటీ, సర్వీస్ కల్పించడం తమ ప్రాధాన్యత క్రమాలన్నారు. అటుపై వేగం గురించి ఆలోచిస్తామన్నారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వానికి సూచన లు ఇవ్వడానికి నిపుణుల కమిటీ వేయనున్నామన్నారు. పరిస్థితికి తగ్గట్టు టికెట్టు చార్జీలను పెంచడం తప్పుకాదన్నారు.
మంగళూరు, బెంగళూరు, చెన్నైలను కలుపుతూ ‘కోల్ కారిడార్’ను నిర్మించాల్సి ఉందన్నారు. అందువల్ల బొగ్గు రవాణా సులభమవుతుందని సదానంద గౌడ అభిప్రాయపడ్డారు. తనకు అనుకోకుండా రైల్వేశాఖ వంటి అత్యంత ప్రాధాన్యత కలిగిన రైల్వే శాఖ లభించడం ఎంతో సంతోషం కలిగించే విషయమన్నారు. అదే సమయంలో బాధ్యతను కూడా పెంచిందన్నారు. ప్రజలకు సాధ్యమైనంత ఉత్తమ సేవలను అందించడానికి 24 ్ఠ 7 ప్రకారం పనిచేయడానికి తాను సిద్ధమన్నారు.
రాజకీయాలు వేరు అభివృద్ధి వేరని సదానందగౌడ అభిప్రాయపడ్డారు. అందువల్ల రైల్వే శాఖ అభివృద్ధికి ఏ పార్టీకి చెందిన నాయకులైనా సలహాలు, సూచనలు ఇవ్వొచ్చన్నారు. త్వరలో మాజీ కేంద్ర రైల్వే మంత్రులు మల్లికార్జున ఖర్గే, జాఫర్‌షరీఫ్‌లను కలిసి రైల్వే అభివృద్ధి విషయమై సూచనలు చేయమని విజ్ఞప్తి చేస్తామన్నారు.
రైల్వే టికెట్ వితరణలో దళారుల బెడదను నియంత్రించడానికి వీలుగా నూతన సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తామన్నారు. కాగా, ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ రాష్ట్రానికి చెందిన వివిధ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు పలువురు సీనియర్ రైల్వే అధికారులతో సదానంద గౌడ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులపై ఆరాతీశారు.