సాక్షి, చెన్నై: రాష్ర్టంలో చతికిలపడిన కాంగ్రెస్ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొంటున్న ఆ పార్టీకి అభ్యర్థులు కరువయ్యూరు. సీనియర్లు ముఖం చాటేయడంతో చివరకు మాజీలు, సిట్టింగ్‌లు, యువజన నాయకులను అభ్యర్థులుగా ప్రకటించుకోవాల్సిన పరిస్థితి. కొన్ని చోట్ల చావోరేవో అన్నట్టుగా అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళుతుంటే, మరి కొన్ని చోట్ల ప్రచారానికి ఆ పార్టీ అభ్యర్థులే డుమ్మా కొడుతున్నారు. తమకు పట్టున్న స్థానాల్లో సీనియర్లు తీవ్రంగానే ఓట్ల వేటలో ఉన్నారు. అయితే, తమ హామీలు, ప్రసంగాల మీద ప్రజలకు విశ్వాసం సన్న గిల్లడంతో కంగు తినాల్సిన పరిస్థితి. చివరకు తమ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్‌లతో పాటుగా జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న నాయకులను పిలిపించి వారి ద్వారానైనా ఓటర్లను మెప్పించే యత్నం చేద్దామని టీఎన్‌సీసీ వర్గాలు యత్నించాయి.
ఫ్లాప్ షో: తమ అధినేత్రి సోనియా గాంధీ ప్రచారానికి రానున్నడంతో టీఎన్‌సీసీలో ఆనందం వెల్లివిరిసింది. అయితే, ఆమె కేవలం కన్యాకుమారికి మాత్రమే పరిమితం అయ్యారు. తెలంగాణలో కరీంనగర్ పర్యటనకు వెళ్లాల్సి ఉండడంతో కన్యాకుమారి సభను ఆగమేఘాలపై ముగించేశారు. వచ్చామా? నాలుగు మాటాలు మాట్లాడామా? వెళ్లామా! అన్న చందంగా ఆమె పర్యటన సాగింది. మిట్ట మధ్యాహ్నం వేళ ఆమె రాక కోసం జనాన్ని బాగానే సమీకరించినా, ఆమె ప్రసంగం, పర్యటనతో అభ్యర్థులకు ఒరిగింది శూన్యం. దీంతో రాహుల్ గాంధీ ద్వారానైనా తమకు నాలుగు ఓట్లు పడేనా అన్న ఎదురు చూపుల్లో అభ్యర్థులు ఉన్నారు.
ఫలించిన ఒత్తిడి: తమిళనాడు మీద, తమిళ నేతల మీద తీవ్ర అసంతృప్తితో ఉన్న రాహుల్ ఇక్కడ ప్రచారం చేపట్టడానికి తొలుత విముఖత వ్యక్తం చేశారు. గత అనుభవం దృష్ట్యా, ఇక్కడ ప్రచారం చేపట్టినా ఫలితం ఉండదన్న నిర్ణయానికి రాహుల్ వచ్చినట్టు ఢిల్లీ నుంచి సంకేతాలు వెలువడ్డాయి. ఇది ఇక్కడి పార్టీ శ్రేణులను మరింత డీలా పడేలా చేసింది. చివరకు ఏఐసీసీ కార్యదర్శి తిరునావుక్కరసర్ ఒత్తిడికి రాహుల్ దిగి రావాల్సి వచ్చింది. రాహుల్ వస్తున్న సమాచారంతో క రూర్ బరిలో ఉన్న మహిళా విభాగం జాతీయ నాయకులు జ్యోతిమణి, తిరుచ్చి బరిలో ఉన్న మరో మహిళా నాయకురాలు చారు బాలా తొండైమాన్‌లు తమ నియోజకవర్గంలో అంటే, తమ నియోజకవర్గంలోనూ పర్యటించాలని విన్నవించారు. అయితే, వారి విజ్ఞప్తి రాహుల్ చెవికి పడలేదు. కేవలం రామనాధపురం బరిలో ఉన్న తిరునావుక్కరసర్‌కు మద్దతుగా ప్రచార సభలో ప్రసంగించేందుకు రాహుల్ నిర్ణయించడం గమనార్హం. ఇందుకు కారణం తిరునావుక్కరసర్‌కు ఇక్కడ వ్యక్తిగత ఓటు బ్యాంకు లక్షకు పైగా ఉండటమే.
ఏర్పాట్లు : రామనాధపురం ప్రచార సభ ఏర్పాట్లలో టీఎన్‌సీసీ మునిగింది. అక్కడి బహిరంగ సభ మైదానాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞాన దేశికన్ శనివారం పరిశీలించారు. ఆ జిల్లా పోలీసు యంత్రాంగం భద్రతా ఏర్పాట్లలో మునిగింది. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు రామనాథపురంలో తిష్ట వేశాయి. రాహుల్ పర్యటన పై జ్ఞాన దేశికన్ పేర్కొంటూ, ఢిల్లీ నుంచి సోమవారం మదురైకు రాహుల్ రానున్నారని వివరించారు. 3.30 గంటలకు మదురై వచ్చే రాహుల్ అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో రామనాధపురం చేరుకుంటారని పేర్కొన్నారు. 4.30 గంటలకు ప్రచార సభ ఆరంభం అవుతుందని, ఈ పర్యటన ముగించుకుని అదే రోజు తిరుగు పయనం అవుతారన్నారు. యువరాజు పర్యటన ఖరారు కావడంతో ఇక, పీఎం మన్మోహన్ సింగ్ పర్యటన ఖరారవుతుందా అన్న ప్రశ్న బయలు దేరింది.
శివగంగైలో మన్మోహన్: కేంద్ర ఆర్థికమంత్రి పి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం శివగంగై బరిలో ఉన్నారు. తనకు ఇక్కడ వ్యక్తిగత బలం ఉన్నా, చిదంబరంలో తెలియని భయం వెంటాడుతోంది. దీంతో తన ప్రగతిని, తాను చేసిన మంచి పనులను ప్రధాని మన్మోహన్ సింగ్ నోట ఇక్కడి ఓటర్లకు తెలియజేయాలన్న నిర్ణయానికి వచ్చారు. శివగంగైలో పర్యటించాలంటూ మన్మోహన్ సింగ్‌ను విజ్ఞప్తి చేశారు. 22వ తేదీ రాష్ట్రంలో ప్రచారం పరిసమాప్తం అవుతున్న దృష్ట్యా, అదే రోజు అందరు అభ్యర్థులను శివగంగై వేదిక మీద నిలబెట్టి, ఓటర్లను ఆకర్షింప చేయడానికి టీఎన్‌సీసీ సైతం కసరత్తుల్లో పడింది. తనయుడి కోసం చిదంబరం ప్రచార సభకు నిర్ణయిస్తే, అందరు అభ్యర్థులను ఒకే వేదిక మీద ఎక్కించడం కుదరదన్న సంకేతాన్ని ఇచ్చినట్టు సమాచారం. దీంతో చివరి రోజు ప్రచార సభపై నీలి నీడలు ఆవహించి ఉన్నాయి. మన్మోహన్ సింగ్ తప్పకుండా వచ్చి తీరుతారంటూ చిదంబరం మద్దతుదారులు చెబుతుంటే, అధికారికంగా పర్యటన ఖరారు కావాల్సి ఉందని టీఎన్‌సీసీ వర్గాలు పేర్కొంటుండడం గమనార్హం.
‘యువరాజు’వస్తున్నారహో
Published Sun, Apr 20 2014 3:21 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
Advertisement