చెన్నై, సాక్షి ప్రతినిధి:లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకోసం ఒక్కరోజు పర్యటనకు వచ్చిన రాహుల్ సోమవారం రామనాథపురంలో ప్రచారం నిర్వహించారు. ఢిల్లీ నుం చి ప్రత్యేక విమానంలో మదురైకి అక్కడి నుంచి హెలికాప్టర్‌లో రామనాథపురానికి చేరుకున్నారు. ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలు నాటి కాంగ్రెస్ నేత కామరాజనాడార్ పాలనను మర్చిపోలేదని, మధ్యాహ్న భోజన పథకం ఆయనే ప్రవేశపెట్టారని అన్నారు. ఈ పథకానికి తాము మరిన్ని మెరుగులు దిద్దామని తెలిపారు. ఈ పథకం వల్ల లక్షలాదిమంది విద్యార్థుల ఆకలి తీరుతోందన్నారు. అటువంటి కామరాజనాడార్ పాలనను రాష్ట్రంలో మళ్లీ తీసుకొస్తామని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీచేయడం వల్ల రాష్ట్రంలో కూడా అధికారం ఖాయమని తెలుస్తోందని అన్నారు. ఈ లోక్‌సభే కాదు ఇకపై అన్ని ఎన్నికల్లోనూ రాష్ట్రంలో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని ప్రకటించారు. పార్టీ శ్రేణుల్లో కనపడుతున్న ఉత్సాహం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తమిళనాడులో మత్స్యకారులదే ప్రధాన సమస్యగా తాము భావిస్తున్నామని చెప్పారు.
జాలర్ల
ప్రతినిధుల కోరిక మేరకే ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చామని తెలిపారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే జాలర్ల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని అన్నారు. తమిళ జాలర్ల సంక్షేమానికి తమ ప్రభుత్వం రూ.15వేల కోట్లు ఖర్చుచేసిందని, అయితే కాంగ్రెస్ ఏమీ చేయలేదన్నట్లుగా ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయని అన్నారు.రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన నరేంద్రమోడీ తమిళనాడు ప్రజల సమస్యల గురించి మాట్లాడకుండా గుజరాత్ అభివృద్ధిని ఏకరువు పెట్టారని రాహుల్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలన్నీ కూటములుగా ఏర్పడి మభ్యపెడుతున్నాయన్నారు. ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో అధికారంలో రావని చెప్పారు. అందుకే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే ఓటేయాలని పిలుపునిచ్చారు. కేంద్రమంత్రులు పీ చిదంబరం, జీకే వాసన్, టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్, రామనాథపురం అభ్యర్థి తిరునావుక్కరసు తదితరులు రాహుల్‌తోపాటూ వేదికపై ఉన్నారు.
ఒంటరి పోరే ముద్దు
Published Tue, Apr 22 2014 12:17 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
Advertisement
Advertisement