సాక్షి, న్యూఢిల్లీ: గడిచిన 72 సంవత్సరాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న వర్షాకాలమే సుధీర్ఘమైనదని వాతావరణ విభాగం చెబుతోంది. సాధారణంగా ప్రతి ఏడాది జూలై మొదటివారంలో నగరాన్ని పలకరించే చిరుజల్లులు ఈ ఏడాది రుతుపవనాల ముందస్తు రాకతో జూన్ 16నే పలకరించాయి.
సుదీర్ఘ వానప్రస్థానం!
Published Thu, Oct 3 2013 1:52 AM | Last Updated on Fri, Sep 1 2017 11:17 PM
సాక్షి, న్యూఢిల్లీ: గడిచిన 72 సంవత్సరాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న వర్షాకాలమే సుధీర్ఘమైనదని వాతావరణ విభాగం చెబుతోంది. సాధారణంగా ప్రతి ఏడాది జూలై మొదటివారంలో నగరాన్ని పలకరించే చిరుజల్లులు ఈ ఏడాది రుతుపవనాల ముందస్తు రాకతో జూన్ 16నే పలకరించాయి. ఇలా అప్పటి నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు నగరంతోపాటు జాతీయ రాజధాని ప్రాదేశిక ప్రాంతం(ఎన్సీఆర్) పరిధిలో ఎక్కడో ఓ చోట చెదురుమదురుగానైనా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. నగరాన్ని అతలాకుతలం చేసేంత కాకపోయినా ప్రతి రోజూ నగరవాసిని పలకరిస్తున్న వాన ప్రస్థానం ఈ ఏడాది ఇంకా కొనసాగుతూనే ఉంది.
అక్టోబర్ నెల ప్రారంభమైనప్పటికీ చలి జాడ లేదు. ఇంకా తేలికపాటి నుంచి ఓ మోస్తరు జల్లులు నగరంలో ఎక్కడో ఒకచోట పడుతూనే ఉన్నాయి. ఈ నెలలో కూడా ఇంకా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ విభాగం చెబుతోంది. 1956లో అత్యధికంగా 111 రోజులపాటు వర్షాకాలం కొనసాగింది. ఇప్పటివరకు ఇదే అత్యధికం. అయితే ఈ ఏడాది మాత్రం ఆ రికార్డు చెరిగిపోయే అవకాశముందంటున్నారు. ప్రతి సంవత్సరం 85 రోజులకు మించి వర్షాకాలం ఉండడం లేదు.
1956లో తప్ప గత 70 సంవత్సరాల్లో 80 రోజుల్లోపే వర్షాకాలం వెళ్లిపోయిందని, అయితే ఈసారి మాత్రం రికార్డు స్థాయిలో వానప్రస్థానం కొనసాగుతోందని అధికారులు చెబుతున్నా రు. ఇక కురిసిన వర్షపాతం విషయానికి వస్తే ఈ సంవత్సరం 35 శాతం అధికంగా వర్షపాతం నమోదైందని వాతావరణ విభాగం అధికారులు చెప్పారు. ఇదిలా ఉండగా, బుధవారం ఉదయం నుంచే వాతావరణం కాస్త అసౌకర్యంగా మారింది. ఎండ తీవ్రత, గాలిలో నీటి ఆవిరి శాతం పెరగడం వల్ల ఉక్కపోతతో నగరవాసులు ఇబ్బందిపడ్డారు. అయితే సాయంత్రానికి వాతావరణం ఆహ్లాదకరంగా మారడంతో ఊపిరిపీల్చుకున్నారు.
Advertisement
Advertisement