మనవి వర్షాధార పంటలే!
ప్రధాన పంటలు : కంది, మొక్కజొన్న
సాగు విస్తీర్ణం : 2.43లక్షల హెక్టార్లు
సాగునీరు : కేవలం 9వేల హెక్టార్లే
సాగునీటి వనరులు : కోయిల్‌సాగర్, రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకాలు
మహబూబ్‌నగర్ వ్యవసాయం : ఇకనుంచి మన జిల్లావన్నీ వర్షాధార పంటలే. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 7.60 లక్షల హెక్టార్లలో సాగు విస్తీర్ణం ఉండగా జిల్లాల విభజనతో సగటు విస్తీర్ణం 2.43లక్షల హెక్టార్లకు చేరుకుంది. ఇప్పుడున్న 26 మండలాల్లో ప్రధానంగా రైతులు కంది, మొక్కజొన్నపంటలనే సాగుచేస్తారు. సాగునీటి ప్రధాన వనరులున్న మండలాలు ఇతర జిల్లాలోకి వెళ్లడంతో ప్రస్తుతం పాలమూరు రైతులు వర్షాధార పంటలపై ఆధారపడాల్సిన పరిస్థితులున్నాయి.
వరి సాగు కష్టమే..
జిల్లాలో సాగునీటి వనరులు తక్కువగా ఉండడంతో వరి సాగు కష్టతరం కానుంది. గతం నుంచి కూడా జిల్లా రైతులు బోర్లపై ఆధారపడి వరి పంటను సాగు చేస్తుంటారు. అయితే జిల్లాలో సగటుకు మించి వర్షాలు కురిస్తేనే బోర్లలో నీటిమట్టం పెరిగి పంటలను సాగు చేసుకునే వీలుంటుంది. వరుసగా నాలుగేళ్లు లోటు వర్షపాతం నమోదు కావడంతో భూగర్భజలాలు అడుగంటాయి. ఈ ఏడాది సగటుకు మించి వర్షాలు కురిసినా చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండలేదు. దీంతో బోర్లలో నీటిమట్టం పెరుగలేదు. ఈ కారణంగా జిల్లాలో వరి పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఉమ్మడి జిల్లాలో 99వేల హెక్టార్లలో వరి సాగవ్వగా ప్రస్తుతం 36వేలకు పడిపోయింది. ఈ ఏడాది ఖరీఫ్‌లో అయితే 19వేల హెక్టార్లలో మాత్రమే వరి పంటలు సాగు చేశారు.
జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో కంది, మొక్కజొన్న పంటలు ప్రధానమైనవి. గత ఖరీఫ్‌లో జిల్లా సగటు సాగు విస్తీర్ణం 2.43లక్షల హెక్టార్లుగా నమోదవ్వగా ఈ ఏడాది ఖరీఫ్‌లో 2.44హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. అందులో ప్రధానంగా కంది పంట సాధారణ సాగు 57వేల హెక్టార్లు. ఈ ఖరీఫ్‌లో 1.03లక్షల హెక్టార్లలో సాగుచేశారు. అలాగే మొక్కజొన్న సగటు సాగు విస్తీర్ణం 32వేల హెక్టార్లు. ఈ ఖరీఫ్‌లో 45వేల హెక్టార్లలో సాగు చేశారు. అలాగే పత్తి 54వేల హెక్టార్లు, ఈ ఏడాది 22వేల హెక్టార్లు, జొన్న 13వేల హెక్టార్లు కాగా రైతులు 16వేల హెక్టార్లలో సాగుచేశారు.
కోయిల్‌సాగర్, రాజీవ్ భీమా ఎత్తిపోతలతో..
జిల్లాలో సాగునీటి పథకాలైన కోయిల్‌సాగర్ రిజర్వాయర్, రాజీవ్ భీమా ఎత్తిపోతల ప్రాజెక్టులే సాగునీటికి ప్రధాన వనరులుగా మారాయి. కోయిల్‌సాగర్ రిజర్వాయర్ కింద 4726 హెక్టార్లు, రాజీవ్ భీమా ఎత్తిపోతల ప్రాజెక్ట్ కింద 4200 హెక్టార్లకు మాత్రమే సాగు నీరు అందనుంది. అయితే కల్వకుర్తి మూడోవిడత ఎత్తిపోతల పథకం పనులు పూర్తయితే మరో 2500హెక్టార్లకు సాగునీరందే అవకాశం ఉంటుంది.