అభిమానుల పార్టీ
చెన్నై, సాక్షి ప్రతినిధి: సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రంపై దశాబ్దాల తరబడి ఊహాగానాలు సాగుతుండగా, రజనీ అభిమాన సంఘాల నేత ప్రకటన ఇచ్చాడు. రజనీకాంత్ జన్మదినమైన ఈనెల 12న అభిమాన సంఘాలన్నీ రాజకీయపార్టీగా రూపాంతరం చెందుతున్నట్లు తమిళనాడు రజనీకాంత్ ప్రజా కార్మికుల సంఘం అధ్యక్షులు ఎస్‌ఎస్ మురుగేష్ ప్రకటించారు.
రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు సీజన్ వచ్చినపుడల్లా రజనీకోసం అన్ని పార్టీలూ ప్రయత్నాలు చేయడం రాష్ట్రంలో పరిపాటిగా మారింది. రజనీ సైతం నర్మగర్భంగా వ్యవహరిస్తూ సంకేతాలు ఇవ్వడమేగానీ ఏ పార్టీకి ప్రత్యక్ష మద్దతు ప్రకటించలేదు. తాజా పార్లమెంటు ఎన్నికలు, ఇటీవల జయలలిత రాజకీయ సంక్షోభ సమయంలో సైతం రజనీ ప్రసన్నం కోసం బీజేపీ బలంగా ప్రయత్నాలు చేసింది. అయితే జయ బెయిలుపై విడుదల కాగానే రజనీ ఆమెకు శుభాకాంక్షలు తెలపడంతో అన్ని పార్టీలు బిత్తరపోగా, బీజేపీ భారీమోతాదులో భంగపడింది. రజనీ రాజకీయ ప్రవేశంపై అన్ని పార్టీలు దాదాపుగా ఆశలు వదులుకున్నాయి.
జన్మదినం రోజున రాజకీయ పార్టీ
రజనీకాంత్ బలం, బలగమంతా ఆయన అభిమానులు, అభిమాన సంఘాలే. అటువంటిది రాష్ట్రంలోని రజనీ అభిమాన సంఘాలన్నింటినీ రాజకీయపార్టీగా మార్చబోతునట్లు తిరుపూరు జిల్లాకు చెందిన రజనీకాంత్ వీరాభిమాని మురుగేష్ ప్రకటించి సంచలనానికి తెరలేపారు. రజనీకాంత్ మహిళా సేవా సంఘాలను సైతం కలుపుకుని పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రజనీ అభిమాన సంఘాలను రాజకీయపార్టీగా మారుస్తున్నామని పేర్కొంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు సైతం చేసుకున్నట్లు మురుగేష్ వెల్లడించారు. 12వ తేదీన పార్టీ పేరును ప్రకటించిన అనంతరం మరికొద్ది రోజుల్లో మదురై లేదా కోవైలో పార్టీ మహానాడును భారీ ఎత్తున నిర్వహించబోతున్నట్లు ఆయన చెప్పారు. ర జనీ అభిమాన సంఘాల అధ్యక్షులతో చర్చించిన అనంతరమే రాజకీయపార్టీ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తిరుపూరు కేంద్రంగా పార్టీ ఆవిర్భావంపై 14 జిల్లాల్లో సన్నాహాలు ప్రారంభించినట్లు తెలిపారు.
ఆనవాయితీ కొనసాగేనా?
ప్రతి ఏడాది డిసెంబరు 12వ తేదీన రజనీకాంత్ తన జన్మదినాన్ని ఆయన అభిమానులు కోలాహలంగా జరుపుకుంటారు. ఉచితంగా పుస్తకాల పంపిణీ, అన్నదానం వంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. రజనీ సైతం జన్మదినాన అభిమానులను కలుసుకోవడం ఆనవాయితీ. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే అభిమానులను తన ఇంటి వద్ద ప్రత్యక్షంగా పలకరిస్తారు. ఈ ఏడాది తన జన్మదిన కానుకగా లింగా చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు రజనీ స్వయంగా ప్రకటించడంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది.
లింగా విడుదలతోపాటూ రజనీ జన్మదినాన్ని కోలాహలంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో అదే రోజున రజనీ అభిమాన సంఘాలు రాజకీయ పార్టీగా మార బోతున్నట్లు వెలువడిన ప్రకటన అందరినీ అయోమయంలో పడవేసింది. రజనీ అభిమానులంతా తిరుపూరులో పార్టీ అవిర్భావ వేడుకకు హాజరవుతారా లేక చెన్నైలోని రజనీ ఇంటికి చేరుకుంటారా అనేది అగమ్యగోచరమైంది. రజనీ అభిమాన సంఘాల కార్యకలాపాలను పర్యవేక్షించే ఆయన సోదరుడు సత్యనారాయణరావు రెండురోజుల క్రితం తిరుచ్చికి వచ్చారు. రజనీ రాజకీయ అరంగేట్రంపై ఆయనను ప్రశ్నించినవారికి ‘రజనీ రాజకీయాల్లోకి రారు, రజనీకి రాజకీయాలు సూట్ కావు అని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యల వల్ల రాజకీయపార్టీ ఆవిర్భావానికి రజనీకి ఎటువంటి సంబంధం లేదని తేలింది.
మురుగేష్ చర్యలను మరో అభిమాని తీవ్రంగా తప్పుపట్టాడు. రజనీ అభిమాన సంఘాన్ని రాజకీయ పార్టీగా మార్చడం అభిమాన సంఘాల నిబంధనలకు విరుద్ధమని ఖండించారు. రజనీ పేరు, ప్రతిష్టలను మురుగేష్ అప్రతిష్టపాలు చేస్తున్నాడని చెప్పారు. రజనీ పేరును దుర్వినియోగం చేస్తున్న వారిపై చర్య తప్పదని మరో అభిమాని చేసిన హెచ్చరిక వల్ల అభిమాన సంఘాలన్నీ మురుగేష్ బాటలో పయనించడం లేదని స్పష్టమైంది. అభిమాన సంఘాలు రాజకీయపార్టీగా మారుతున్న క్రమంపై రజనీకాంత్ ఏవిధంగా స్పందిస్తారో తేలాలంటే మరో రెండురోజులు ఆగాల్సిందే.