ప్రజలకు సేవ చేస్తా
ప్రజలకు సేవ చే యడమే తన ఏకైక లక్ష్యమని సూపర్‌స్టార్ రజనీకాంత్ స్పష్టం చేశారు. లింగా చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ నటించిన తాజా చిత్రం లింగా. అనుష్క, సోనాక్షి సిన్హాలు నాయికలు. టాలీవుడ్ ప్రముఖ నటుడు జగపతిబాబు ప్రతినాయకుడిగా నటించారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాక్‌లైన్ వెంకటేశ్ నిర్మించారు. ఈరో స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ లింగా చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తం గా డిసెంబర్ 12న విడుదలకు సన్నాహాలు చేస్తోంది. ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ ఆదివారం ఉదయం స్థానిక అన్నాసాలైలోని సత్యం సినిమా థియేటర్‌లో జరిగింది. చిత్ర ఆడియోను రజనీకాంత్ ఆవిష్కరించి తొలి ప్రతిని చిత్ర యూనిట్‌కు అందించారు.
రజనీ చూపించిన టైటిల్ లింగా
దర్శకుడు కేఎస్ రవికుమార్ లింగా చిత్ర టైటిల్‌ను ఎవరు చూపించాలన్న విషయాన్ని ప్రస్తావిస్తూ తొలి చిత్రానికి వెంక న్న అనుకున్నామని అయితే రజనీ టైటిల్ కొంచెం సాఫ్ట్‌గా అనిపిస్తోందని, ఇంకొంచెం ఫోర్స్‌గా ఉంటే బాగుంటుందన్నారన్నారు. ఆ తరువాత ఆయనే లింగా టైటిల్‌ను చూపించారని తెలిపారు. సీనియర్ దర్శకుడు ఎస్‌పి ముత్తురామన్ మాట్లాడుతూ రజనీకాంత్ అనారోగ్యానికి గురై, విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆయనకు ప్రశాంతతను కలిగించింది ఆయన మనవళ్లు లింగా, యాత్రలేనని తెలిపారు. అందువలన తన మనవడు లింగా పేరు ప్రాచుర్యం పొందాలనే ఈ చిత్రానికి ఆ టైటిల్ నిర్ణయించారన్నారు. లింగా చిత్రాన్ని తాను నిర్మించానంటే ఇప్పటికీ కలగానే ఉందని చిత్ర నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ అన్నారు. ఇంతకుముందు ఎన్ని చిత్రాలు చేసినా లింగా చిత్రం అనుభవం మరపురానిదన్నారు.
దర్శకుడు శంకర్ మాట్లాడుతూ లింగా చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోందన్నారు. ఈ చిత్రం గురించి పలువురు లింగా చిత్రం డబుల్ పడయప్పలా ఉంటుందని మరికొందరు ఈ చిత్ర స్టిల్స్ చూస్తుంటే శివాజీ చిత్రంలో రజనీ గుర్తుకొస్తున్నారని, ఇంకొందరు లింగా ఎందిరన్‌ను మించిపోయిందని చెబుతున్నారన్నారు.
రజనీ అంటే చాలా ఇష్టం
రజనీకాంత్ అంటే తనకు చాలా ఇష్టమని ఈ చిత్రంలో నటించిన జగపతిబాబు తెలిపారు. తాను పుట్టి పెరిగింది ఇక్కడే. చిన్నప్పటి నుంచి రజనీ చిత్రాలు చూస్తున్నాను. అందుకే లింగా చిత్రంలో నటించే అవకాశం రావడంతో కథ కూడా వినకుండా నటించడానికి ఒప్పేసుకున్నానన్నారు. రజనీకాంత్ తనకు ఆయన బయోగ్రఫీ పుస్తకాన్ని గిఫ్ట్‌గా ఇచ్చారు. తానందుకున్న తొలి బయోగ్రఫీ పుస్తకం ఇదేనన్నారు.
సోనాక్షి సిన్హా మాట్లాడుతూ తాను సూపర్‌స్టార్ హీరోయిన్ అంటే ఆనందం పట్టలేక అరిచేశానన్నారు. అంతేకాదు అయామ్ రజనీ ఫ్యాన్ అన్నారు. లుంగీ డాన్స్, లింగా డాన్స్ అంటూ డాన్స్ హమ్ చేస్తూ ఆడేశారు. అనుష్క మాట్లాడుతూ రజనీకాంత్‌తో తొలిసారి నటించాను. చాలా సంతోషంగా ఉందని, ఆయనతో కలిసి నటించిన అనుభవాన్ని ఎక్స్‌ప్రెస్ చేయలేనన్నారు.
జయించడమే ముఖ్యం
రజనీకాంత్ మాట్లాడుతూ తాను అనారోగ్యానికి గురైన తరువాత మళ్లీ నటించగలనా అని చింతించానన్నారు. కొంచెం గ్యాప్ తీసుకుని తన కూతురు సౌందర్య దర్శకత్వంలో ప్రయోగాత్మక చిత్రం కోచ్చడయాన్ చేశానన్నారు. ఆ చిత్రం ఆర్థికంగా లాభించకపోయినా సౌందర్యకు అపార అనుభవాన్ని కలిగించిందన్నారు. అది యానిమేషన్ చిత్రం కావడంతో చాలామంది అభిమానులు చివరిలోనైనా తాను మామూలు నటుడిగా కనిపిం చాలని ఆశించినట్లు తెలిపారన్నారు. దీంతో ఒక కమర్షియల్ చిత్రం వెంటనే చేయాలన్న నిర్ణయమే లింగా అని తెలిపారు. ఈ వేదికపై చాలా మంది రాజకీయాల్లోకి రావాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారన్నారు. అయితే రాజకీయాలంటే తనకేమీ భయం లేదని, వాటి లోతు కూడా తెలుసన్నారు. సినిమా చేయడం సులభమే, అలాగే రాజకీయ రంగ ప్రవేశం కష్టసాధ్యం కాదు. అయితే జయించడమే ముఖ్యం అన్నారు. పలు అవరోధాలను అధిగమించాల్సి ఉంటుందన్నారు. కొన్ని పరిస్థితులే తననీ స్థాయికి నిలబెట్టాయని, అదే విధంగా రేపటి పరిస్థితుల్లో ఏ స్థాయికి చేరుస్తాయో తెలియదన్నారు. అయితే ఖచ్చితంగా తనను నమ్మిన వాళ్లకు సేవ చేస్తానని రజనీ అన్నారు.