సూపర్‌స్టార్ తదుపరి దర్శకుడెవరు? | Superstar Rajinikanth next movie director Sundar C | Sakshi
Sakshi News home page

సూపర్‌స్టార్ తదుపరి దర్శకుడెవరు?

Published Mon, Jan 19 2015 2:06 AM | Last Updated on Sat, Sep 2 2017 7:52 PM

సూపర్‌స్టార్ తదుపరి దర్శకుడెవరు?

సూపర్‌స్టార్ తదుపరి దర్శకుడెవరు?

సూపర్‌స్టార్ రజనీకాంత్ తదుపరి చిత్రానికి సిద్ధం అయ్యార న్నది పరిశ్రమ వర్గాల సమచారం. అయితే దర్శకుడెవరన్న విషయంపైనే రకరకాల ప్రచారం జరుగుతోంది. కోచ్చడయాన్ 3డి యానిమేషన్ చిత్రం నిరాశపరచడంతో త్వరితగతిన మరో మంచి కమర్షియల్ చిత్రం చేయాలన్న రజనీ ఆలోచనకు తెరరూపమే లింగా చిత్రం. తన ఆలోచనలకు తగ్గట్టుగా చిత్రం రూపొందించగల దిట్ట కె ఎస్ రవికుమార్ అని భావించి లింగా చిత్ర బాధ్యతలను ఆయనకు అప్పగించారు. ఆ చిత్రం నిర్మాతకు 200 కోట్లు వ్యాపారం చేసిందని సమాచారం.
 
 అయితే డిస్ట్రిబ్యూటర్లే భారీ నష్టాలకు గురయ్యామంటూ దీక్షలు, ఆందోళనలు చేశారు. ప్రస్తుతం ఈ విషయంలో నష్టపరిహారానికి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇలాంటి నేపథ్యంలో రజనీకాంత్ తదుపరిచిత్రానికి దర్శకుడెవరన్న అంశంపై నలుగురైదుగురు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వీరిలో పి.వాసు, శంకర్, సురేష్‌కృష్ణ, సుందర్ సి, కెఎస్ రవికుమార్‌ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
 
 పి.వాసు ఇప్పటికే రజనీతో చంద్రముఖి, కుచేలన్ చిత్రాలు తెరకెక్కించగా వాటిలో చంద్రముఖి అమోఘ విజయం సాధించగా కుచేలన్ ఆశించిన విజయం సాధించలేదు. ఆ తరువాత రజనీతో చంద్రముఖి-2 రూపొందించాలని పి.వాసు ఆశించారు. అయితే ఆ ప్రయత్నం ఫలించలేదు. శంకర్ రజనీకాంత్ కలయికలో శివాజీ, ఎందిరన్ రెండు చిత్రాలు ఘన విజయం సాధించాయి. తాజాగా ఎందిరన్-2 ప్రయత్నం తెరపైకి కొచ్చింది. అయితే ఈ విషయమై శంకర్ నుంచి గానీ, రజనీ నుంచి గానీ సరైన క్లారిటీ రాలేదు.
 
 అదే విధంగా కెఎస్ రవికుమార్ రజనీతో ముత్తు, పడయప్పా వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు తెరకెక్కించారు. లింగా చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ప్రస్తుతం కె ఎస్ రవికుమార్ సుదీప్ హీరోగా నటించే చిత్రంలో బిజీగా ఉన్నారు. అదే విధంగా భాషా, అన్నామలై వంటి సెన్సేషనల్ చిత్రాలను రూపొందించిన దర్శకుడు సురేష్‌కృష్ణ రజనీతో భాషా-2 చేయాలని ఆశిస్తున్నారు. దీనికి స్క్రిప్టును కూడా సిద్ధం చేసుకున్నారు. రజనీ ఎప్పుడు రెడీ అంటే అప్పుడే షూటింగ్ అనేలా ఉన్నట్లు సమాచారం. ఇక సూపర్‌స్టార్ అరుణాచలం వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన సుందర్‌సి కూడా ఆయనతో మరో చిత్రం చేయడానికి రెడీగా ఉన్నట్లు కోడంబాక్కం టాక్. మరి వీరిలో ఎవరిపై రజనీ దృష్టి పడుతుందో వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement