లింగపై ఫిర్యాదు
లింగ చిత్రంపై న్యాయవాది ఒకరు సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ చిత్ర యూనిట్ దిగ్భ్రాంతికి గురైంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం లింగ. ఈ చిత్రం ప్రారంభం నుంచి సమస్యలను ఎదుర్కొంటూనే ఉండడం గమనార్హం. లింగా చిత్రం వివాదాంశమైన ముల్లై పెరియార్ డ్యామ్ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం అంటూ కన్నడ భాషా సంఘాలు ఆదిలోనే షూటింగ్‌ను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగాయి. ఆ సమస్య సద్దుమణిగినా ఆంధ్రాలో షూటింగ్ జరుగుతుండగా మరో సమస్యను ఎదుర్కొంది. లింగ చిత్రం ముల్లై వనం 999 అనే కథను కాపీ చేశారంటూ మదురై హైకోర్టులో ఒక వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. దీనికి రజనీ బదులు పిటిషన్ దాఖలుచేశారు. ఈ అంశం కోర్టులో ఉండగా చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల జరిగింది.
దీంతో లింగ చిత్రాన్ని రేపు (సోమవారం) సెన్సార్ సభ్యుల ముందు ప్రదర్శనకు సిద్ధమైంది. ఇలాంటి పరిస్థితిలో న్యాయవాది నన్‌మారన్ లింగ చిత్రంపై శనివారం న్యాయబోర్డుకు ఫిర్యాదు చేశారు. అందులో ఆయన పేర్కొంటూ లింగ చిత్రంలో న్యాయశాఖను, న్యాయవాదులను విమర్శించే సన్నివేశాలు చోటు చేసుకున్నాయని తెలిసిందన్నారు. అందువల్ల ఆ సన్నివేశాలను చిత్రం నుంచి తొలగించాలని, లింగ చిత్రాన్ని విడుదలకు ముందు తమకు ప్రదర్శించాలని పేర్కొన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ లింగ చిత్రంలో న్యాయశాఖను, న్యాయవాదులను విమర్శించే సన్నివేశాలున్నాయని తెలిసిందన్నారు. వాటిని ముందుగా తొలగిస్తే సమస్యలను నివారించవచ్చన్న ఉద్దేశంతోనే ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు.