
రమ్యకృష్ణ పారితోషికం ఎంతో తెలుసా?
కోటికి 10 లక్షలు మాత్రమే తక్కువగా పారితోషికం తీసుకుంటున్న పడయప్పా నటి ఈ తరం కథానాయికలకు పోటీగా నిలుస్తున్నారనేది కోడంబాక్కం టాక్. నటి రమ్యకృష్ణ కథానాయికిగా ఎన్ని చిత్రాలు చేసినా ఎన్ని విజయాలు సొంతం చేసుకున్నా పడయప్పా చిత్రంలో నీలాంబరి పాత్ర ఆమె కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయింది. అలాంటి నటి ఇప్పుడు ఆంటీ పాత్రలు పోషిస్తున్నారు. అదీ అడపా దడపా మాత్రమే. అయితే పారితోషికంలో మాత్రం ఈ తరం హీరోయిన్లతో పోటీ పడుతున్నారట. తాజాగా ఆంబళ చిత్రంలో రమ్యకృష్ణ అత్తగా నటిస్తున్నారు.
విశాల్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ఆంబళ. సుందర్ సి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హన్సిక హీరోయిన్. ఈ చిత్రంలో విశాల్ అత్తలుగా రమ్యకృష్ణ, కిరణ్ రాథోడ్, ఐశ్వర్య నటిస్తున్నారు. కిరణ్‌రాథోడ్ ఇంతకుముందు సుందర్‌సి దర్శకత్వంలో కమలహాసన్ సరసన అన్భే శివం చిత్రంలో నటించారు. ప్రస్తుతం అంతగా అవకాశాలు లేవు. దీంతో సుందర్ సి ఆంభళ చిత్రంలో అవకాశం కల్పించారు. ఈ అమ్మడి పారితోషికం 10 లక్షలట. ఇక మరో అత్తగా నటిస్తున్న ఐశ్వర్య పారితోషికం ఐదు లక్షలని సమాచారం. రమ్యకృష్ణ పారితోషికం ఎంతో తెలుసా? 90లక్షలట.
ఈమె ఈ చిత్రం కోసం రోజుకు మూడు లక్షలు పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం. ఆ విధంగా ఈ చిత్రానికి 30 రోజులు కాల్‌షీట్స్ కేటాయించారట. ఆ విధంగా గణాంకాలు వేస్తే రమ్యకృష్ణ పారితోషికం 90 లక్షలకు చేరింది. ఇదే గనుక నిజం అయితే ఆమె హీరోయిన్‌గా నటిస్తున్న సమయంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో పారితోషికం తీసుకుని వుండరు. అత్తగా 90 లక్షలు తీసుకుంటూ దటీజ్ రమ్యకృష్ణ అని నిరూపించుకుంటున్నారన్నమాట.