టైటిల్: గుంటూరు కారం
నటీనటులు: మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరీ, జగపతి బాబు, రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్, రావు రమేష్, ఈశ్వరీరావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్ తదితరులు
నిర్మాణ సంస్థ: హారిక అండ్ హాసిని క్రియేషన్స్
నిర్మాత: ఎస్ రాధాకృష్ణ(చినబాబు)
రచన, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
సినిమాటోగ్రఫి: మనోజ్ పరమహంస, పీఎస్ వినోద్
సంగీతం:తమన్
ఎడిటింగ్: నవీన్ నూలి
విడుదల తేది: జనవరి 12, 2024
కథేంటంటే..
జనదళం పార్టీ అధినేత వైరా వెంకట సూర్య నారాయణ(ప్రకాశ్ రాజ్) కూతురు వైరా వసుంధర(రమ్యకృష్ణ) మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికవుతుంది. కూతుర్ని మంత్రి చేయాలని సూర్య నారాయణ భావిస్తాడు. అదే సమయంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కాటా మధు(రవి శంకర్) కూడా మంత్రి పదవి ఆశిస్తాడు. తనను కాదని కూతురికి మంత్రి పదవి ఇస్తే.. ఆమెకు రెండో పెళ్లి అయిన విషయాన్ని.. అలాగే మొదటి భర్తతో కలిగిన సంతానం గురించి బయటపెడతా అని బెదిరిస్తాడు.
అయినా కూడా కుతూరినే మంత్రి చేస్తాడు సూర్యనారాయణ. ముందుచూపుగా వసుంధర మొదటి కొడుకు వీర వెంకట రమణ అలియాస్ రమణ(మహేశ్ బాబు)ను పిలిపించి తల్లితో తనకు ఎలాంటి సంబంధం లేదని రాసిన బాండ్ పేపర్స్ మీద సంతకం పెట్టించాలని ప్రయత్నిస్తాడు. అయితే రమణ మాత్రం సంతకం చేయడానికి అంగీకరించడు. తండ్రి రాయల్ సత్యం(జయరామ్) చెప్పినా వినకుండా.. గుంటూరులోనే ఉంటూ మిర్చి యార్డ్‌ని నడిపిస్తుంటాడు. అసలు వసుంధర మొదటి భర్త రాయల్ సత్యంకు ఎందుకు విడాకులు ఇచ్చింది? పదేళ్ల కొడుకును వదిలేసి రెండో పెళ్లి ఎందుకు చేసుకుంది? పాతికేళ్ల కొడుకు ఇంటి ముందుకు వచ్చినా.. చూడడానికి ఎందుకు నిరాకరించింది? అముక్త మాల్యద అలియాస్ అమ్ము(శ్రీలీల)తో రమణ ఎలా లవ్‌లో పడ్డాడు? మరదలు మరదలు రాజి (మీనాక్షి చౌదరి) పాత్ర ఏమిటి? చివరకు రమణ తల్లి ప్రేమను ఎలా పొందాడు? అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే..
త్రివిక్రమ్ సినిమాల్లో బంధాలు, భావోద్వేగాలది ప్రధాన పాత్ర ఉంటుంది. కథంతా ఓ ప్యామిలీ చుట్టూ తిరుగుతుంది. గుంటూరు కారం సినిమా కూడా అదే పంథాలో సాగుతుంది. అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదం కారణంగా చెల్ల చెదురైన ఓ మంచి కుటుంబం.. మళ్లీ ఎలా కలిసింది? దూరమైన తల్లి, కొడుకు చివరకు ఎలా దగ్గరయ్యారు అనేది ఈ సినిమా కథ. ఇలాంటి కథలు తెలుగు తెరకు కొత్తేమి కాదు... ఇంకా చెప్పాలంటే త్రివిక్రమ్ శ్రీనివాసే ఈ తరహా కాన్సెప్ట్‌లో సినిమాలను తెరకెక్కించాడు.
అల.. వైకుంఠపురములో, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి సినిమాల తాలుకు ఛాయలు ఇందులో కనిపిస్తాయి. అంతేకాదు త్రివిక్రమ్ సంభాషణల్లోనూ కొత్తదనం కొరవడింది. అయితే కామెడీ విషయంలో మాత్రం ఎక్కడ తగ్గలేదు. పంచ్ డైలాగ్స్, పరుగులు పెట్టించే స్క్రీన్‌ప్లేతో బోర్ కొట్టించకుండా కథనాన్ని నడిపించాడు.
సినిమా ప్రారంభంలోనే అసలు కథ ఏంటి? కథనం ఎలా సాగబోతుందనేది రివీల్ చేసేశాడు. మహేశ్ బాబు ఎంట్రీ అదిరిపోతుంది.తనదైన కామెడీ టైమింగ్‌తో ఇరగదీశాడు. ఇక ‘నాది నెక్లెస్ గొలుసు’ పాటకు మహేశ్, శ్రీలీల వేసే స్టెప్పులు ఫ్యాన్స్‌ని అలరిస్తాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ ఎపిసోడ్, ఎమోషనల్ సీన్ ఆకట్టుకుంటుంది. హీరోకి తల్లి ఎందుకు దూరమైందనే విషయాన్ని మాత్రం ఫస్టాఫ్‌లో రివీల్ చేయకుండా సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ.. సెకండాఫ్‌పై ఆసక్తి పెంచేలా చేశాడు. ఫస్టాఫ్‌లో కథేమి ఉండడు. ‘కిటికిలో నుంచి చూసే నాన్న.. తలుపులు మూసుకునే అమ్మ.. రోడ్డు మీద తిరిగే కొడుకు’ సింపుల్‌గా చెప్పాలంటే ఇదే ఫస్టాఫ్ కథ.
ఇక సెకండాఫ్ కాస్త హిలేరియస్‌గా సాగుతుంది. లేడిస్‌తో హీరో చేసే యాక్షన్ ఎపిసోడ్, అజయ్ క్యారెక్టర్‌తో పండించే కామెడీ బాగానే వర్కౌట్ అయింది. అయితే సినిమాకు ముగింపు ఎలా ఉంటుందో ముందే ఊహించొచ్చు. చెప్పుకోవడానికి పెద్ద ట్విస్టులు కూడా లేవు. తల్లి కొడుకులు విడిపోయేలా పన్నాగం పన్నిన వ్యక్తి, దానికి గల కారణం ఏంటనేది చివరి వరకు పసిగట్టకుండా జాగ్రత్త పడ్డాడు. చివర్లో తల్లి-కొడుకు( రమ్యకృష్ణ- మహేశ్‌బాబు) మధ్య జరిగే సంభాషణలు హృదయాలను హత్తుకుంటాయి. కొడుకుని ఎందుకు దూరం పెట్టారనేది కూడా కన్విన్సింగ్‌గానే అనిపిస్తుంది.
ఎవరెలా చేశారంటే..
రమణ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేశాడు మహేశ్ బాబు. యాక్షన్‌తో పాటు డ్యాన్స్ కూడా ఇరగదీశాడు. డైలాగ్ డెలివరీలోనూ కొత్తదనం చూపించాడు. తెరపై స్టైలీష్‌గా కనిపించాడు. అమ్ము పాత్రలో శ్రీలీల ఒదిగిపోయింది. ఎప్పటి మాదిరే డ్యాన్స్ ఇరగదీసింది. చీరకట్టులో తెరపై చాలా అందంగా కనిపించింది. ఇక వైరా వసుంధరగా రమ్యకృష్ణ మరోసారి గుర్తిండిపోయే పాత్రలో నటించింది. ఫస్టాఫ్‌లో ఆమె పాత్ర సాదాసీదాగా ఉన్నప్పటికీ.. సెకండాఫ్‌లో మాత్రం తనదైన నటనతో ఆకట్టుకుంది.
హీరో మరదలుగా మీనాక్షి చౌదరి నిడివి తక్కువే అయినా ఉన్నంతలో చక్కగా నటించింది. జగపతి బాబు, రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్, రావు రమేష్, ఈశ్వరీరావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. తమన్ సంగీతం బాగుంది. పాటలతో పాటు మంచి నేపథ్య సంగీతాన్ని అందించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. ఏదేమైనా గుంటూరు కారం ఘాటు మాత్రం కాస్త తగ్గిందనే చెప్పాలి.
Comments
Please login to add a commentAdd a comment