సాక్షి, చెన్నై : రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ వైద్య కోర్సుల ప్రవేశ నిమిత్తం దరఖాస్తులు సిద్ధం అయ్యాయి. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సోమవారం నుంచి ఈనెల 28 వరకు ఈ దరఖాస్తులను పంపిణీ చేయనున్నారు.
రాష్ట్రంలోని ఉన్నత విద్యా విధానం మేరకు ఇంజినీరింగ్, వైద్య కోర్సుల సీట్లను ప్రభుత్వం భర్తీ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఇంజనీరింగ్ సీట్లను అన్నా వర్సిటీ ద్వారా, వైద్య కోర్సుల సీట్లను ప్రభుత్వ వైద్య కళాశాలల ద్వారా భర్తీ చేయడం జరుగుతోన్నది. ఆ మేరకు ఇప్పటికే ఇంజినీరింగ్ కోర్సుల దరఖాస్తుల విక్రయానికి శ్రీకారం చుట్టారు. ఇక, వైద్య కోర్సుల్ని అభ్యషించాలన్న ఆశయంతో ఉన్న విద్యార్థులు దరఖాస్తులు ఎప్పుడెప్పుడు పంపిణీ చేస్తారా..? అన్న ఎదురు చూపుల్లో పడ్డారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ నేతృత్వంలో దరఖాస్తులు సిద్ధం కావడంతో, ఇక పంపిణీకి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.
నేటి నుంచి దరఖాస్తులు: రాష్ట్రంలో 19 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్నాయి. ఇందులో 2,555 సీట్లు ఉండగా, 383 సీట్లు జాతీయ స్థాయి కౌన్సెలింగ్‌కు అప్పగించారు. మిగిలిన 2,172 సీట్లను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనున్నది. అలాగే, రాష్ట్రంలో 12 స్వయం ప్రతిపత్తి హోదా(ప్రైవేటు) కళాశాలల్లో 1,560 సీట్లు ఉన్నాయి. 993 సీట్లు మేనేజ్ మెంట్ కోటాకు చెందినవి కాగా, మిగిలిన సీట్లు ప్రభుత్వ కోటా కింద భర్తీ చేయడం జరుగుతున్నది. ఇక రాష్ట్రప్రభుత్వం పరిధిలో చెన్నైలోని దంత వైద్య కళాశాలలో 85 సీట్లు ఉన్నాయి. వీటి భర్తీ నిమిత్తం దరఖాస్తుల్ని ఆహ్వానించేందుకు ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. ఇందు కోసం యాభై వేల వరకు దరఖాస్తుల్ని సిద్ధం చేసి ఉన్నారు. సోమవారం నుంచి వీటిని విక్రయించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. చెన్నై స్టాన్లీ, చెంగల్పట్టు , తిరునల్వేలి, మదురై, కోయంబత్తూరు, తిరుచ్చి, తదితర 19 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి దరఖాస్తులను, చెన్నైలో దంత కళాశాలలో బీడీఎస్ కు దరఖాస్తులను పంపిణీ చేయనున్నారు. ఒక్కో దరఖాస్తు ధర *500గా నిర్ణయించారు.
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు దరఖాస్తులను ఉచితగా పంపిణీ చేయనున్నారు. ఈనెల 28 వరకు దరఖాస్తుల్ని పంపిణీ చేయనున్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను 29వ తేదీ సాయంత్రంలోపు సమర్పించాల్సి ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు వరకు దరఖాస్తుల పంపిణీ జరగనున్నది. సోమవారం నుంచి దరఖాస్తుల పర్వం ఆరంభం కానున్నడంతో ఉదయాన్నే పెద్ద సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తుల కోసం ప్రభుత్వ కళాశాలల వద్ద బారులు తీరడం ఖాయం.
‘వెద్య’ దరఖాస్తులు రెడీ
Published Mon, May 11 2015 2:34 AM | Last Updated on Sun, Sep 3 2017 1:48 AM
Advertisement