- ఆధార్‌తో అనుసంధానం ప్రారంభం
- 26 నుంచి ప్రత్యేక శిబిరాలు
- ఈసీ సక్సేనా వెల్లడి
చెన్నై, సాక్షి ప్రతినిధి : రాష్ట్ర అసెంబ్లీకి ఏ క్షణాన ఎన్నికలు వచ్చినా నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సందీప్ సక్సేనా ప్రకటిం చారు. చెన్నై నగరంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ, ముందస్తుగానే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని అన్నాడీఎంకేకు చెందిన ఒక పార్లమెంటు సభ్యుడు ప్రకటించడంపై సక్సేనా స్పందించారు. ఒకవేళ ఈ ఏడాదిలోనే ఎన్నికలు వచ్చినా నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పా రు. ఓటర్ల జాబితాను నూరు శాతం సరిచూసే పనులు తమిళనాడు మినహా దేశమంతా సాగుతున్నాయన్నారు. అయినా ఎన్నికలు సమీపిస్తే తాజాగా సవరించిన ఓటర్ల జాబితా ప్రకారం నిర్వహిస్తామని తెలిపారు.
ఆధార్ అనుసంధానానికి ప్రత్యేక శిబిరాలు
రాష్ట్రంలో మార్చి 3వ తేదీ నుంచి ఓటరు గుర్తింపుకార్డులో ఆధార్, సెల్‌ఫోన్ నెంబర్లను, ఈ మెయిల్ ఐడీలను చేర్చేపని ప్రారంభమైందని తెలిపారు. పోలింగ్‌బూత్ సిబ్బంది ఇంటింటికీ తిరిగి ఇందుకు అవసరమైన దరఖాస్తులను ఓటరుకు అందజేసి సమాచారం సేకరిస్తున్నట్లు తెలిపారు. రెండు వారాల్లో రెండు కోట్ల మంది నుంచి వివరాలను సేకరించగా అందులో 35 లక్షల ఓటర్ల సమాచారాన్ని ఇంటర్నెట్‌లో పొందుపరిచామని అన్నారు. ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగాలు చేసే వారి సౌకర్యార్థం రాష్ట్ర వ్యాప్తంగా 63 వేల పోలింగ్‌బూత్‌లలో నాలుగురోజుల పాటూ ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 12, 26, మే 10, 24 తేదీల్లో ఈ శిబిరాలు జరుగుతాయని తెలిపారు.
ఈ నాలుగు రోజులు ఆదివారాలు అయిన కారణంగా ఉద్యోగులు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నామని అన్నారు. ప్రతి ఎన్నికల్లోనూ ఓటువేసే పోలింగ్ కేంద్రాలకు ఆధార్‌కార్డు జిరాక్స్ కాపీని తీసుకువె ళ్లి వివరాలు నమోదు చేసుకోవచ్చని ఆయన అన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ ప్రత్యేక శిబిరాలు పనిచేస్తాయని చెప్పారు. అలాగే ఓటర్ల జాబితాలో పేర్లు లేనివారు, మరో నియోజకవర్గ పరిధిలోకి మారినవారు సైతం ఈ శిబిరాలను వినియోగించుకోవచ్చని తెలిపారు. రాష్ట్రంలోని 32 జిల్లాల్లో నిర్వహించే ఈ ప్రత్యేక శిబిరాలను పది మంది ఐఏఎస్ అధికారులు పర్యవేక్షిస్తారని తెలిపారు.