చెన్నై, సాక్షి ప్రతినిధి: ఎన్నికల ప్రచార యుద్ధంలో కదం తొక్కేందుకు కోలీవుడ్ కదలుతోంది. అన్ని ప్రధాన పార్టీల ప్రచారంలోనూ తారలు తళుక్కుమనేందుకు సిద్ధం అవుతున్నారు. జనాన్ని ఆకర్షించాలంటే ఎక్కడైనా, ఎప్పుడైనా స్టార్ ఎట్రాక్షన్ అవసరమే. అందునా అధికార పీఠం కట్టబెట్టే ఎన్నికలంటే ఇక చెప్పక్కర్లేదు. తమిళనాడు రాజకీయాలకు, సినిమా రంగానికి అనాదిగా అవినాభావ సంబంధం ఉంది. ద్రవిడ పార్టీలకు ఆద్యుడు అన్నాదురై రంగస్థలం, సినిమా రంగాలకు తన కలం పదును చూపించారు.
రాష్ట్రంలో తొలిసారిగా ప్రాంతీయ పార్టీని స్థాపించాలనే ఆలోచన అన్నాదురై మేధస్సు నుంచి పుట్టినదే. జీవించి ఉన్నంతకాలం డీఎంకే వ్యవస్థాపకుడిగా అన్నాదురై కీర్తిగడించారు. ఆయన గతించి న తరువాత పార్టీ పగ్గాలు పట్టిన కరుణానిధి సినిమా రంగాన్ని ఒక ఊపు ఊపినవారే. కరుణానిధి ఇంటిలో నిర్మాతలు, హీరోలు ఉన్నారు. అలాగే అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు హీరోగా ఎంజీ రామచంద్రన్ తమిళ సినీరంగాన్ని శాసించారు. ఎంజీఆర్ మరణించిన తరువాత అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు చేతపట్టిన జయలలిత అగ్ర హీరోయిన్‌గా ప్రజల ను మెప్పించినవారే.
ఎంజీఆర్ సమకాలికుడు దివంగత శివాజీ గణేషన్ సైతం కామరాజ నాడార్ శిష్యునిగా, కాంగ్రెస్ నాయకుడిగా కొనసాగారు. డీఎండీకే అధినేత విజయకాంత్ మాస్ హీరోగా ఆయన స్థానం ప్రత్యేకం. ఇలా దాదాపుగా అన్ని ప్రధాన పార్టీల నేతలూ ముందు సినిమా రంగం ఆ తరువాతనే రాజకీయ రంగంలో అడుగుపెట్టిన వారు. దీంతో సహజంగానే తమిళనాడులో రాజకీయం, సినిమా రంగాలు విడదీయలేని అనుబంధాన్ని కలిగి ఉన్నాయి.
తారల ఆకర్షణ తప్పనిసరి : రాజకీయ నాయకులు చేసే ఊకదంపుడు ఉపన్యాసాలు వినేందుకు ప్రజలను వేదిక వద్దకు రప్పించాలంటే ఏదో ఒక ఆకర్షణ ఉండాల్సిందే. తృణమో, పణమో ఇచ్చి జనాన్ని తోలడం రాజకీయపార్టీలకు ఎలాగూ అలవాటే. వీటికి అదనపు ఆకర్షణగా తారలను దించేందుకు అన్ని పార్టీలు సిద్దం అవుతున్నాయి. కొన్నాళ్లపాటూ షూటింగులు పక్కనపెట్టి మీటింగులకు హాజరయ్యేలా నటీ నటులు ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో అన్నాడీఎంకేతో డీఎండీకే అధినేత విజయకాంత్ పొత్తుపెట్టుకున్నారు.
విజయకాంత్ అంటే గిట్టని హాస్యనటుడు వడివేలు డీఎంకే తరఫున రంగంలోకి దిగి రాష్ట్రవ్యాప్తంగా ఉధృతంగా ప్రచారం చేశారు. తన ప్రసంగాల్లో విజయకాంత్‌ను దుమ్మెత్తిపోశారు. వడివేలుకు విశేషమైన క్రేజు ఉండడంతో డీఎంకే సభలకు పెద్ద ఎత్తున జనం వచ్చేవారు. అన్నాడీఎంకే తరఫున ఆ పార్టీ అధినేత్రి జయలలితే పెద్ద స్టార్ ఎట్రాక్షన్. అన్నాడీఎంకేలో ఏకైక స్టార్ కాంపైన్ కూడా జయలలితనే. నటులు రామరాజన్, ఆనందరాజ్, పొన్నంబళం, సెంథిల్, సింగముత్తు, నటీమణులు సీఆర్ సరస్వతి, వింధ్య తదితరులు ప్రచారం చేయనున్నారు.
డీఎంకే తరఫున నటలు వాగైచంద్రశేఖర్, కుమరి ముత్తు, వాసువిక్రం, పూచ్చీ మురుగన్ సిద్ధమయ్యారు. ఈసారి డీఎంకే తరఫున ప్రచారానికి వడివేలు స్థానంలో మరో వర్ధమాన హాస్యనటుడు ఇమాన్ అన్నాచ్చీ వచ్చిచేరారు. ఇక కాంగ్రెస్‌లో ఇద్దరు ప్రముఖ హీరోయిన్లు కుష్బు, నగ్మా ప్రచారంలో పోటీపడనున్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే సీనియర్ నటులు విసు, ఎస్వీ శేఖర్, సంగీత దర్శకులు డెరైక్టర్ గంగై అమరన్ ప్రచారం చేసే అవకాశం ఉంది. డీఎండీకేలో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన హీరో అరుణ్ పాండియన్ ఇటీవలే రాజీనామా చేయడంతో పాటూ అమ్మ సరసన చేరారు. ఎన్నికలు సమీపించే కొద్దీ మరింత మంది తారలు ప్రచారంలోకి వచ్చే అవకాశం ఉంది.
నడిగర్ సంఘం తటస్థ వైఖరి:ఎన్నికల్లో దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం తటస్థ వైఖరిని అవలంభిస్తుందని అధ్యక్షుడు నాజర్ పేర్కొన్నారు. ఇటీవల రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాజేష్ లఖానీని నాజర్ కలిశారు. 2014 ఎన్నికల సమయంలో వేదికపై నాటకాల ప్రదర్శనకు ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో ఈసీని కలిసిన నాజర్ ఎన్నికల ప్రచార వేదికలపై సాంస్కృతిక, నాటక కళల ప్రదర్శనపై నిషేధం విధించి కళాకారుల ఉపాధిని దెబ్బతీయవద్దని కోరారు. అయితే ఏ పార్టీకి ప్రచారం చేయకుండా కార్యక్రమాలను నిర్వహిస్తామని నాజర్ ఆయనకు హామీ ఇచ్చారు. తమ సంఘంలో అన్ని పార్టీలకు చెందిన వారు ఉన్నారు, ఏ పార్టీకి ప్రచారం చేస్తారో అది వారి వ్యక్తిగత విషయమని ఆయన పేర్కొన్నారు. అయితే సంఘం మాత్రం తటస్థవైఖరికి కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.
ఎన్నికల ప్రచారంలో సినీతారలు
Published Thu, Feb 25 2016 2:57 AM | Last Updated on Tue, Aug 14 2018 4:34 PM
Advertisement
Advertisement